తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నప్పటికీ, గులాబీ బాస్ తీరును 20 ఏళ్లుగా పరిశీలిస్తోన్న విశ్లేషకులు మాత్రం.ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ ప్రజల్ని కన్విన్స్ చేయగల సత్తా కేసీఆర్ కు ఉందని, ప్రత్యర్థులను బోల్తా కొట్టించడానికే ముందస్తు లేదన్నారుగానీ, వ్యవహార శైలి ఎన్నికల వేడిని రాజేసేలానే ఉందని అంటున్నారు.
ఈ సంవత్సరాంతంలో సడెన్ గా కేసీఆర్ ఎన్నికల ప్రకటన చేసినా ఆశ్చర్యపోరాదంటోన్న విపక్షాలు టీఆర్ఎస్ కు ధీటుగా వ్యూహరచనలో బిజీగా ఉన్నాయి.అయితే, ఈసారి ఎన్నికలు పలు అనూహ్య ఘట్టాలకు వేదిక కానున్నట్లు తెలుస్తోంది.
వాటికి సంబంధించి తెలంగాణ ఉద్యమ సారథి, టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరామ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి పోరాడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే సీఎం కేసీఆర్ కు కంటగింపుగా మారిన ప్రొఫెసర్ కోదండరామ్ తర్వాతి కాలంలో తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పెట్టడం తెలిసిందే.
ధన బలం కలిగిన పార్టీలను ఢీకొనలేక టీజేఎస్ దాదాపు అన్ని ఎన్నికల్లోనూ చతికిలపడింది.అయితే, టీఆర్ఎస్, కేసీఆర్ వ్యతిరేక శక్తులు క్రమంగా పుంజుకుంటోన్నా అది కోదండరామ్ పార్టీకి అనుకూలంగా మాత్రం లేదు.
దీంతో పార్టీ బలోపేతానికి ఏం చేయాలనే అంశాన్ని చర్చించేందుకు టీజేఎస్ కీలక నేతలు హైదరాబాద్ శివారులోని ఓ ఫార్మ్ హౌజ్ లో విస్తృత స్థాయి సమావేశం జరిపారు.
ప్రొఫెసర్ కోదండరామ్ పట్ల తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ టీజేఎస్ సొంతగా ఓట్లు, సీట్లు సాధించలేని స్థితిలో ఉంది కాబట్టి ఏదైనా జాతీయ పార్టీలో విలీనం ద్వారా లబ్దిపొందొచ్చని నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
సైద్ధాంతికంగా బీజేపీతో కలవలేమని, కాంగ్రెస్ పరిస్థితే బాగోలేదు కాబట్టి ఆ రెండు జాతీయ పార్టీలతో కలవడానికి కోదండరామ్ సిద్ధంగా లేరని వెల్లడైంది.అయితే తెలంగాణలో తృతీయ ప్రత్యామ్నాయంగా టీజేఎస్ నిలవగలదని, ఆ దిశగా ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందనీ నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

జాతీయ పార్టీ హోదాకు దాదాపు చేరువైన ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణపైనా ఫోకస్ పెట్టింది.ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 14 నుంచి తెలంగాణలో కార్యకలాపాలను విస్తృతం చేయనున్నారు.ఒక పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే కనీసం 4 రాష్ట్రాల్లోనైనా 6 శాతం ఓట్లు రాబాట్టుకోగలగాలి.ఆమ్ ఆద్మీ పార్టీ 52 శాతం ఓట్లతో ఢిల్లీలో, 42 శాతం ఓట్లతో పంజాబ్ లో అధికారంలో ఉండగా, గోవాలో 6 శాతం ఓట్లు సాధించింది.
ఉత్తరాఖండ్ లో ఆప్ దాదాపు 4 శాతం ఓట్లు సాధించింది.అంటే ఉత్తరాఖండ్ గానీ మరేదైనా రాష్ట్రంలోగానీ ఆప్ 6 శాతం ఓట్లను సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభిస్తుంది.
ఆ పని తెలంగాణలోనే జరిగేందుకు ప్రొఫెసర్ కోదండరామ్ సాయం తీసుకోవాలని చీపురు పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీలో తెలంగాణ జనసమితి విలీనం ప్రతిపాదనలపై స్థానిక నేతలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.ప్రొఫెసర్ కోదండరామ్ ను కన్విన్స్ చేయడానికి కొందరు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రొఫెసర్ మాత్రం తొందరాటు తగదని నేతలకు సూచిస్తున్నారు.
పొత్తుపై ఎన్నికల నాటికి ఓ నిర్ణయానికి వద్దామని, అప్పటిదాకా టీజేఎస్ సొంతగా ఎదిగేందుకు అవసరమైన ప్రణాళికను పకడ్బందీగా అమలు చేద్దామని కోదండరామ్ నిర్దేశించినట్లు తెలిసింది.

టీజేఎస్ ఫలానా పార్టీలో విలీనం కాబోతోందనే గుసగుసలపై ప్రొఫెసర్ కోదండరామ్ నేరుగానూ పలు మీడియా చానెళ్లతో మాట్లాడారు.కొంతకాలంగా టీజేఎస్ విలీనం అంటూ వార్తలు వస్తున్నాయని, అయితే, తమకు అలాంటి ఆలోచన లేదని, పార్టీ భవిష్యత్ కార్యచరణ కోసమే భేటీ జరిగింది కానీ పొత్తులపై మాట్లాడుకునేందు కాదని కోదండరామ్ కుండబద్దలు కొట్టారు.ప్రస్తుతం పార్టీ బలోపేతంపైనే ఫోకస్ పెట్టామని, ఇప్పటికే 24 నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించామన్నారు.
ప్రస్తుతానికైతే ఆమ్ ఆద్మీ పార్టీలో టీజేఎస్ విలీన ప్రతిపాదనలు లేవన్న కోదండరామ్.ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసొచ్చే పార్టీలతో పని చేస్తామనీ చెప్పారు.







