వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డపైకి అడుగు పెట్టిన భారతీయులు ఎన్నో విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే.రాజకీయాలు, క్రీడలు, వ్యాపారాలు, వైద్యం, సామాజిక, ఆర్ధిక రంగాల్లో ఇండో అమెరికన్లు ఉన్నత స్థాయిలో వున్నారు.
పాత తరంతో పాటు వారి సంతతి కూడా ఇప్పుడు దూసుకెళ్తూ.భారత్, అమెరికాలకు గర్వకారణంగా నిలుస్తున్నారు.
తాజాగా భారత సంతతి విద్యార్ధినికి అరుదైన గౌరవం దక్కింది.
ఫ్లోరిడాకు చెందిన శ్రద్ధా కార్తీక్ అనే 11వ తరగతి విద్యార్ధిని వేసిన పెయింటింగ్ యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్‌లో ప్రదర్శించేందుకు అర్హత పొందింది.
టంపా హైస్కూల్‌లో చదువు కుంటున్న శ్రద్ధా.టంపా మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన వార్షిక కాంగ్రెషనల్ ఆర్ట్ కాంపిటీషన్‌లో విజేతగా నిలిచింది.
స్ధానిక హిల్స్‌బరో కౌంటీలోని హైస్కూల్ విద్యార్ధులు తమ ఆర్ట్ వర్క్‌ని యూఎస్ క్యాపిటల్‌లో ప్రదర్శించే అర్హత కోసం పోటీపడ్డారు.

ఏడాది వయసులో చెన్నై నుంచి తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వచ్చిన శ్రద్ధా కార్తీక్ రూపొందించిన గ్రాఫైట్ డ్రాయింగ్ ‘పెన్సివ్ గ్యాజ్’కు ఫస్ట్ ప్రైజ్ దక్కింది.ఈ మేరకు కాంగ్రెస్ సభ్యురాలు క్యాథీ.మీడియాకు తెలియ జేశారు.
ఆమె తన ఆర్ట్ వర్క్‌లో డెప్త్, డైమెన్షన్‌ను రూపొందించడానికి విభిన్న షేడ్స్ వున్న గ్రాఫైట్‌ను ఉపయోగించింది.శ్రద్ధా కార్తీక్‌కు ఏడేళ్ల వయసు వున్నప్పటి నుంచి డ్రాయింగ్ వేస్తోంది.
ఆర్కిటెక్చర్‌గా స్థిరపడాలనుకుంటున్న కార్తీక్‌కు ఈ కళ మరింతగా దోహద పడుతోంది.హైస్కూల్ తర్వాత కూడా ఆమె పెయింటింగ్‌ను కొనసాగించాలని యోచిస్తోందట.
ఇది కార్తీక్‌కి తొలి ఆర్ట్ పోటీ కాదు.గతంలో ఎనిమిదో తరగతిలో వున్నప్పటి నుంచి సాల్వడార్ డాలీ మ్యూజియం వార్షిక కళల పోటీలలో పాల్గొంటూ వస్తోంది.
తాజా పోటీలలో గెలుపొందడం ద్వారా శ్రద్ధా కార్తీక్ కళాఖండాన్ని ఏడాది పాటు యూస్ క్యాపిటల్‌లో ప్రదర్శిస్తారు.