ఈ మధ్య కాలంలో ఇంట్లోనే ఉండి ఎంచక్కా ఫోన్లో మూవీ టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు.ఎటువంటి కష్ట పడకుండా నచ్చిన సమయంలో షో టికెట్స్ బుక్ చేసుకుని ఆ సమయానికి ఎంచక్కా థియేటర్ కి వెళ్తున్నారు.
ఇప్పుడంటే ఆన్లైన్ బుకింగ్ వచ్చింది కానీ అంతకుముందు అయితే మూవీ టికెట్స్ కావాలంటే తప్పనిసరిగా థియేటర్ కి వెళ్లి లైన్లో నుంచోవాలిసిందే.ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్లైన్ లో టికెట్స్ ను సగం వరకు మాత్రమే బుక్ చేసుకోవాలనే రూల్ ఉంది.
కానీ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంగించి 100% మూవీ టికెట్స్ ను ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్న కారణంగా బుక్ మై షో పోర్టల్‌తో పాటు ఐనాక్స్ మల్టీప్లెక్స్‌లపై కేసు నమోదు చేసారు.ఈ ఆరోపణల విషయంపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.తార్నాక ప్రాంతానికి చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు శనివారం రోజున కేసు నమోదు చేసారు.
అయితే ఈ కేసుకు సంబందించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం అనే చెప్పాలి.నిజానికి 2006 లోనే ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.47 ఉత్తర్వుల ప్రకారం సినిమా ప్రదర్శనకు సంబంధించిన సగం టిక్కెట్లను డైరెక్ట్ గాను, మిగిలిన సగం టికెట్స్ ను ఆన్‌లైన్‌లో విక్రయించాల్సి ఉంది.

కానీ ఈ నిబంధనలను పట్టించుకోకుండా బుక్ మై షో, ఐనాక్స్‌లు మొత్తం 100% టికెట్లను ఆన్‌లైన్‌లోనే అమ్ముతున్నారని విజయ్ గోపాల్ ఆరోపణ చేసారు.ఈ క్రమంలోనే విజయ్ గోపాల్ సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు మేరకు పోలీసులు న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుని ఆ రెండు సంస్థలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టే పనిలో పడ్డారు.







