తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రస్తుతం ఎన్నికల మూడ్ లో ఉన్నారు .రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు తన వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ ఏకం చేసే పనిలో ఉన్నారు.దీనిలో భాగంగానే ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆయన కలిసి వారితో చర్చించారు.
దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ ను కీలకం చేసేందుకు, మూడో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు ఆయన తెర వెనుక ముందు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే అనేక మార్లు ఢిల్లీకి ఆయన వెళ్తూ చేయాల్సిన రాజకీయమంతా చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో పండిన ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి అని టిఆర్ఎస్ పెద్ద ఆందోళన కార్యక్రమం చేపడుతోంది.ఢిల్లీలోనూ ఆందోళనలు చేపట్టేందుకు ప్రయత్నాల్లో ఉంది.
ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనను పెట్టుకోవడం, చివరి నిమిషం వరకు ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు బయటకు పొకుండా చూడటం వంటివి ఆసక్తికరంగా మారాయి. అయితే కేసీఆర్ ఢిల్లీ కి ఎందుకు వెళ్తున్నారు ఎవరితో భేటీ కాబోతున్నారు ? రాజకీయంగా ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అని అనేక ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.అయితే కేసీఆర్ మాత్రం ఢిల్లీకి కుటుంబ సమేతంగా వెళ్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా వైద్య చికిత్సల కోసమే ఈ ఢిల్లీ టూర్ పెట్టినట్లు తెలుస్తోంది.గత కొంత కాలంగా ఢిల్లీలో కొంత మంది వైద్యుల వద్ద కేసీఆర్ చికిత్స తీసుకుంటూ ఉండటంతో , దానిలో భాగంగానే ఆయన ఈ ఢిల్లీ టూర్ కు వెళ్ళినట్లు సమాచారం.అయితే టిఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ ధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర మంత్రులను కలుస్తారని, అపాయింట్మెంట్ దొరికితే ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.







