తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని టార్గెట్ గా చేసుకుని కాంగ్రెస్ సీనియర్ నేతలు కొంతమంది ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తూ ఉండడం, ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తాము ఒప్పుకునేది లేదు అన్నట్లుగా వ్యవహారాలు చేస్తుండడం వంటివి ఇబ్బందికరంగా మారాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం ఏ మాత్రం ఆశాజనకంగా లేదు .రాబోయే సార్వత్రిక ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతుండగా, కాంగ్రెస్ మాత్రం ఇంకా ఆ రేస్ లోకి వెళ్ళలేదు.
అంతర్గత సమస్యలతోనే సతమతమవుతున్నారు. సొంత పార్టీ లో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునే వ్యవహారాలపై దృష్టి పెట్టింది.ఇక సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీనియర్ నాయకులు సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు .సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని దమ్ముంటే పోటీకి అభ్యర్థిని నిలబెట్టి గెలవాలని రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు.ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులు సమావేశం విషయాన్ని అధిష్టానం వద్దకు తీసుకువెళ్లారు.అధిష్టానం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఏఐసీసీ కార్యదర్సి బోసు రాజు ద్వారా ఈ వ్యవహారాన్ని చక్క దిద్దేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
దీంతో రేవంత్ రెడ్డి జగ్గారెడ్డి కి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.జగ్గారెడ్డి కి ఉన్న బాధ్యతల్లో కోత విధించారు.ఇప్పటి వరకు ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతలను మహేష్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ లకు అప్పగించారు.

అంతేకాదు ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్లారు ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లి నట్లు ప్రచారం జరుగుతున్నా, తెలంగాణ సీనియర్ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం సమావేశమై ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారట.అంతేకాదు వీలైతే సోనియా , రాహుల్ కలిసి తెలంగాణలో నెలకొన్న వాస్తవ పరిస్థితిని గురించి వివరించబోతున్నారట.పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం విషయంలో ఇక ఏ మాత్రం మొహమాటం లేకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు రేవంత్ సిద్ధం అవుతున్నారు.
దీని కోసం అధిష్టానం వద్ద అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.