ఏపీ అధికార పార్టీ వైసిపి, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య ఇప్పుడు ‘సారా’ వ్యవహారంపై మాటల యుద్ధం జరుగుతోంది.పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం లోని జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి కొద్ది రోజుల వ్యవధిలోనే దాదాపు 26 మంది వరకు మరణించడం పెద్ద సంచలనంగా మారింది.
ఏపీ అసెంబ్లీలోనూ ఇదే అంశంపై చర్చ జరిగి అది రచ్చ గా మారింది.దీనిపై ఏపీ సీఎం జగన్ సైతం స్పందించారు.
అసలు సారాయి మరణాలు చోటు చేసుకోలేదని , అనారోగ్య కారణాలతోనే అక్కడ మరణాలు చోటుచేసుకున్నాయని జగన్ ప్రకటించారు.మద్యం రేట్లు ఏపీ లో భారీగా తగ్గాయని, అటువంటప్పుడు సారాయి జోలికి ఎవరు వెళ్తారని ? అసలు ఆ ప్రాంతంలో సారాయి కాల్చెందుకు అవకాశం లేదని జగన్ ప్రకటించారు.
అయితే జగన్ చెప్పిన దాంట్లో నిజం లేదనే విషయాన్ని పోలీసులు బయట పెట్టిన కొన్ని ఆధారాలతో స్పష్టం చేస్తున్నాయి.సారా వ్యాపారం చేస్తున్నారన్న అనుమానం ఉన్న వారిని , గతంలో కేసుల్లో ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు .అంతే కాదు నాలుగు రోజుల వ్యవధిలోనే 1129 సారా కేసులు నమోదు కాగా, దీంట్లో 677 మందిని అరెస్టు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రకటించారు.జంగారెడ్డిగూడెంలో సారాయి కాయడ అసాధ్యమని జగన్ చెప్పినా, ఆ ప్రాంతంలోనూ కేసులు నమోదయ్యాయి.
అలాగే సారా కాచే ప్రాంతాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు .సారా తయారీకి ఉపయోగించే 5,76,710 లీటర్ల పులియబెట్టిన బెల్లపు ఊట ను ధ్వంసం చేశారు.

13,471 లీటర్ల సారాను స్వాధీనం చేసుకోగా, 47 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఈ బీ అధికారులు ప్రకటించారు.అసలు సారాయి అమ్మే అవకాశమే లేదని ఏపీ సీఎం జగన్ ప్రకటించిన తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం, సారా కాల్చినట్లుగా ఆధారాలు బయటపడడం ఇవన్నీ ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారాయి.దీంతో సారాయి మరణాలను సాధారణ మరణాలు గా జగన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.








