కెనడా లోని ఒంటారియోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.ఈ ఘటన ఇరు దేశాల్లోనూ తీవ్ర విషాదం నింపింది.
ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తారనుకున్న తమ బిడ్డలను రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించిందని తెలిసి తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ క్రమంలో అసలు ప్రమాదం ఎలా జరిగింది… దీనికి దారి తీసిన పరిస్ధితులపై కెనడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఒంటారియో ప్రావిన్షియల్ పోలీస్ (ఓపీపీ) ఈ మేరకు దర్యాప్తును ముమ్మరం చేసింది.మృతులను హర్‌ప్రీత్ సింగ్, జస్పీందర్ సింగ్, కర్నాపాల్ సింగ్, మోహిత్ చౌహన్, పవన్ కుమార్‌గా గుర్తించారు.
వీరంతా గ్రేటర్ టొరంటో, మాంట్రియల్ ప్రాంతంలో చదువు తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.అలాగే పవన్ కుమార్ హర్యానాకు చెందిన వ్యక్తి కాగా.
మిగిలిన నలుగురు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారేనని కెనడాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.ఇటీవల తీవ్రమైన మంచు కారణంగా రహదారులపై డ్రైవింగ్ పరిస్థితులు ఇప్పటికీ క్లిష్టంగానే వున్నాయని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు ఈ ఘోర ప్రమాదంతో కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఈ క్రమంలో బాధితుల కుటుంబ సభ్యులకు అండగా నిలిచింది.మాంట్రియల్‌కు చెందిన కెనడా ఇండియన్ గ్లోబల్ ఫోరమ్ జాతీయాధ్యక్షుడు డాక్టర్ శివేంద్ర ద్వివేది మాట్లాడుతూ.ఎలాంటి సహాయం అవసరమైనా అందు బాటులో వుంటామని చెప్పారు.అంత్య క్రియలకు లేదా ఆర్దికం గానూ సహాయం చేస్తామని శివేంద్ర వెల్లడించారు.టొరంటోలోని భారత కాన్సులేట్ కార్యాలయం సైతం కెనడియన్ అధికారులు, బాధిత భారతీయ కుటుంబాలతో సమన్వయం చేయడానికి ఒక బృందాన్ని నియమించింది.







