క్రికెట్‌లో అప్పుడప్పుడు మన్కడింగ్ అనే మాటను వింటుంటాం.బ్యాటింగ్ చేసే వ్యక్తి కాకుండా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో మరో బ్యాట్స్‌మెన్ ఈ కారణంగా ఔట్ అయ్యే అవకాశం ఉంది.
బౌలర్ బాల్ వేయకుండా క్రీజు వదిలి ముందుకు వెళ్తే బౌలర్ వికెట్లను గిరాట్టేయొచ్చు.దానిని నిబంధనల ప్రకారం అంపైర్లు ఔట్‌గానే పరిగణిస్తారు.
ఇలాంటి ఔట్లను క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ ఇప్పటి వరకు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు.ఇక నుంచి అలా అనడానికి వీల్లేదు.
దీనికి సంబంధించి అశ్విన్‌ను ఉద్దేశిస్తూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
క్రికెట్‌లో ఎప్పుడైనా మన్కడింగ్ ద్వారా ఔట్ అయితే సదరు బ్యాట్స్‌మెన్‌కు మద్దతుగా ఔట్ చేసిన వారిపై విమర్శలు వ్యక్తమవుతుంటాయి.
దీనిని రద్దు చేయాలంటూ చాలా మంది మాజీలు కోరారు.అయితే వాటికి భిన్నంగా క్రికెట్‌లో కొత్త నిబంధనలు అమలు కానున్నాయి.
క్రికెట్ చట్టాలను రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) ఇటీవల కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.మన్కడింగ్‌ను ఇక నుంచి రనౌట్‌గా పరిగణించాలని నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దడాన్ని రద్దు చేసింది.కొత్తగా క్రీజులోకి వచ్చే బ్యాట్స్‌మెన్ ఎటు వైపు నుంచి బ్యాటింగ్ చేయాలో అని నిర్ణయాన్ని కూడా మార్చింది.
అయితే ఈ కొత్త నిబంధనలన్నీ అక్టోబర్ నుంచి అమలు కానున్నాయి.వీటిపై తొలుత అంపైర్లకు సమగ్ర అవగాహన కల్పించి, ఆ తర్వాత వీటిని అమలు చేయనున్నారు.
ఐపీఎల్ 2019 సీజన్‌లో పంజాబ్ జట్టు తరుపున అశ్విన్ ఆడాడు.ఓ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేశాడు.
నిబంధనల ప్రకారం అది ఔట్ అయినా, క్రీడా స్పూర్తితో అశ్విన్ వ్యవహరించలేదని చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు.తాజాగా మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడంపై సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించాడు.
అప్పటి అశ్విన్ ఘటనను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.ఇక అశ్విన్ స్వేచ్ఛగా మన్కడింగ్ చేయొచ్చంటూ పేర్కొన్నాడు.
పనిలోపనిగా కంగ్రాట్స్ కూడా చెప్పేశాడు.ఇటీవల ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ జట్టు అశ్విన్‌ను దక్కించుకుంది.ఇందుకు రూ.5 కోట్లు వెచ్చించింది.అప్పట్లో గొడవ పట్ట బట్లర్, అశ్విన్ ప్రస్తుతం ఒకే జట్టు తరుపున ఆడనున్నారు.







