రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే ఎత్తులకు పై ఎత్తులు వేయడమే కాదు, జరగబోయే పరిణామాలను ముందుగానే అంచనా వేసి, దానికి అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటేనే, సక్సెస్ సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది.ప్రస్తుతం ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ వ్యవహారాలను చూసుకుంటే బీజేపీ విషయంలో జగన్ ముందుచూపుతో వ్యవహరించారని, కేసీఆర్ మాత్రం బిజెపిని తక్కువ అంచనా వేసి , ఆ పార్టీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాటం చేపడుతూ, బిజెపి రాజకీయ ప్రత్యర్థుల అందరికీ నాయకత్వం వహించడం, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏ మాత్రం ఉండదని, తప్పకుండా ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందని , అలాగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీకి పరాభవం తప్పదని కేసీఆర్ వేసిన అంచనా తలకిందులైంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కటి మినహా మిగిలిన అన్ని చోట్ల బీజేపీ ప్రభావం చూపించింది.దీంతో రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీకి తిరుగుండదనే విశ్లేషణలు మొదలయ్యాయి.అనవసరంగా బీజేపీని శత్రువు గా మార్చుకుని కెసిఆర్ వ్యూహాత్మక రాజకీయ తప్పు చేశారని, కానీ జగన్ మాత్రం బీజేపీ విషయంలో మొదటి నుంచి సైలెంట్ గానే ఉన్నట్లుగా వ్యవహరిస్తూ, తన హవా కొనసాగించారు.ఏపీ అభివృద్ధి దృష్ట్యా, ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పరంగా చూసుకున్నా బిజెపి కి ఎదురు వెళ్లడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని జగన్ ముందుగా అంచనా వేశారు.
దానికి తగ్గట్లుగానే ఇప్పుడు బిజెపి ఫలితాలు సాధించడంతో, రాజకీయ వ్యూహాలను ముందుగా అంచనా వేయడంలో కేసీఆర్ ను మించిన వ్యక్తిగా జగన్ పేరు మారుమోగుతోంది.
ఇప్పటివరకు టిఆర్ఎస్ విషయంలో అంత సీరియస్ గా దృష్టి పెట్టని బీజేపీ అధిష్టానం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
అలాగే ఈ విషయంలో, మరింత సానుకూలత చూపించడంతో పాటు, జగన్ అడిగినా, అడగకపోయినా ఏపీ ప్రభుత్వానికి అన్ని విధాలుగా కేంద్రం మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.బిజెపి కి వ్యతిరేకంగా కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తున్నా, అది ఏమాత్రం పనిచేయదు అన విషయం ఈ ఎన్నికలు రుజువు చేశాయి.
ఇప్పుడు బీజేపీ వ్యతిరేక కూటమి లో చేరేందుకు ప్రాంతీయ పార్టీలు చాలా వరకు వెనక్కి తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.







