తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి క్షణం తీరిక లేకుండా పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారు.ఒక పక్క ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే పార్టీలో కొత్త ఉత్సాహం కనిపించేలా చేసుకుంటున్నారు.
నిత్యం ఏదో ఒక సమస్య పై పోరాటం చేస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే వస్తున్నారు.కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందని, మళ్లీ అధికారం సంపాదించే దిశగా అడుగులు వేయగలుగుతుంది అని రేవంత్ బలంగా నమ్ముతున్నారు.
సొంత పార్టీలోనూ తనపై అసంతృప్తితో ఉన్న నాయకులను గుర్తించి, వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.అలాగే యువ నాయకులను ఎక్కువగా ప్రోత్సహిస్తూ, తనకు తిరిగే లేకుండా రేవంత్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే టిఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు రేవంత్ చాలా వ్యూహాత్మకంగా నే వ్యవహరిస్తున్నారు.దీనిలో భాగంగానే టిఆర్ఎస్ కు చెందిన కొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలను గుర్తించి, వారిని తమ దారిలోకి తెచ్చుకునేందుకు రేవంత్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దీనిలో భాగంగానే బెంగళూరులో ఓ రహస్య సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం టిఆర్ఎస్ ను దెబ్బ కొట్టడమే అని, టిఆర్ఎస్ కు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే విధంగా రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేలతో బెంగళూరులో రేవంత్ రెడ్డి భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సమావేశాన్ని హైదరాబాదులో నిర్వహిస్తే ఇంటెలిజెన్స్ వర్గాలు కనిపెడతాయని, తద్వారా కేసీఆర్ కు సమాచారం చేరిపోతుంది అనే ఉద్దేశంతో బెంగళూరు ప్లాన్ వేసినట్లు సమాచారం.ఈ సమావేశానికి ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లినట్లు తెలుస్తోంది.ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నేతలు బెంగళూరులో కలిసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ చేరికల విషయమే కాకుండా, కాంగ్రెస్ కి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు ఏమి చేయాలి ? ఏ విధంగా ముందుకు వెళ్లాలి ? సీనియర్ జూనియర్ నాయకులను ఎలా కలుపుకు వెళ్లాలి ? పార్టీలో ఎక్కడా అసంతృప్తులు తలెత్తకుండా ఏం చేయాలి అనే విషయంపై కొంతమంది కీలక నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది.బెంగుళూరు సీక్రెట్ మీటింగ్స్ లీక్ అవ్వడంతో టీఆర్ఎస్ కూడా దీనిపై ఆరా తీస్తోందట.