వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఎన్నో రంగాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.రోజురోజుకీ ఈ లిస్ట్ మరింత పెరుగుతూ వస్తోంది.
తాజాగా ప్రతిష్టాత్మకమైన కాంగ్రెషనల్ ఆసియా పసిఫిక్ అమెరికన్ కాకస్ (సీఏపీఏసీ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇండో అమెరికన్ మహిళ నిషా రామచంద్రన్ ఎన్నికయ్యారు.తద్వారా ఈ పదవిని చేపట్టనున్న తొలి దక్షిణాసియా అమెరికన్‌గా నిషా చరిత్ర సృష్టించారు.
డెమొక్రాటిక్ పార్టీ నేత, ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా సహాకురాలిగా పనిచేసిన నిషా.జూలై 22న సీఏపీఏసీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
దీనిపై ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.‘‘ ఈ వారం సీఏపీఏసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా” తన కొత్త పాత్రను ప్రారంభించానని నిషా తెలిపారు.
ఏఏపీఐ సమాజంతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా వుందని, తనకు మద్ధతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.ఇకపోతే 1994లో స్థాపించబడిన సీఏపీఏసీ.
కాంగ్రెస్ ఆఫ్ ఆసియా అమెరికన్స్ పసిఫిక్ ద్వీపవాసుల వారసత్వంతో నిండివుంది.
మరోవైపు నిషా ఎన్నికపై సీఏపీఏసీ చైర్ జూడీ చూ హర్షం వ్యక్తం చేశారు.
ఏఏపీఐ కమ్యూనిటీతో జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవంతో ఆమె సీఏపీఏసీకి వస్తున్నారని తెలిపారు.పౌరహక్కుల నుంచి ఆరోగ్య రక్షణ వరకు నిషా ఈ క్లిష్టమైన సమయంలో సీఏపీఏసీకి మార్గనిర్దేశనం చేస్తారని జూడీ ఆకాంక్షించారు.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆసియా వ్యతిరేక హింసను పరిష్కరించేందుకు తాము నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు.అలాగే కరోనా వైరస్ మహమ్మారి తర్వాత దేశ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నామని జూడీ చూ వెల్లడించారు.
ఏఏపీఐల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లేందుకు నిషాతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.

ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బేరా మాట్లాడుతూ.సీఏపీఏసీ తదుపరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేయడానికి ఎంపికైన నిషా రామచంద్రన్‌కు అభినందనలు తెలిపారు.ఆమె నియామకంతో , ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా దేశస్థురాలిగా నిషా చరిత్ర సృష్టించారని బేరా ప్రశంసించారు.
నిషాకు తన కార్యాలయంలో ఒక దశాబ్ధకాలం పాటు పనిచేసిన అనుభవం వుందని వెల్లడించారు.నిషా గొప్ప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎదుగుతారని… ప్రస్తుత క్లిష్ట పరిస్ధితుల్లో ఏఏపీఐ సమాజానికి తోడ్పాటు విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని అమీ బేరా ఆకాంక్షించారు.
సీఏపీఏసీ సభ్యుడిగా, తమ సంస్థతో కలిసి నిషాతో పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు.నిషా రామచంద్రన్ ఇటీవల తన సొంత కన్సల్టింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.ఆమె దక్షిణాసియా అమెరికన్ల గొంతుకగా వున్న ‘‘డెసిస్ ఫర్ ప్రోగ్రెస్ ’’ సహ వ్యవస్థాపకురాలిగా, బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.