సోషల్ మీడియాలో చురుగ్గా వుండే డొనాల్డ్ ట్రంప్‌కు అవి చేతిలో లేకపోవడం పెద్ద లోటుగానే వుంది.అధికారంలో వున్నప్పుడు ప్రతి విషయాన్ని ఈ మాధ్యమాల సాయంతో ప్రజలతో పంచుకునేవారు ట్రంప్.
కానీ ఎప్పుడైతే క్యాపిటల్ భవనంపై దాడి జరిగిందో నాటి నుంచి సోషల్ మీడియా దిగ్గజాలు ఆయనపై బ్యాన్ వేశాయి.ట్విట్టర్ ట్రంప్‌పై శాశ్వత నిషేధం విధించగా.
ఫేస్‌బుక్ 2023 వరకు బ్యాన్ వేసింది.దీంతో నాటి నుంచి ట్రంప్ చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ మెయిల్స్, బ్లాగ్ సహా కొన్ని ఫ్లాట్ ఫామ్‌లతో కొద్దిరోజులు నెట్టుకొచ్చినా.అది అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు.
తాజాగా ప్రముఖ వీడియోషేరింగ్ ఫ్లాట్‌ఫాం రంబుల్‌లో డొనాల్డ్ ట్రంప్ చేరారు.శనివారం ఒహియోలో తలపెట్టిన భారీ ప్రచార ర్యాలీకి ముందు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ట్రంప్ అధికార ప్రతినిధి లిజ్ హారింగ్టన్ మీడియాతో మాట్లాడుతూ.రంబుల్ చేరడంతో పాటు తన సొంత సోషల్ మీడియాను ప్రారంభించాలనే ప్రణాళికలో ట్రంప్ వున్నారని తెలిపారు.
అయితే ఈ నెల మొదట్లో తన బ్లాగును మూసివేసిన ట్రంప్.తన సొంత సోషల్ మీడియా వేదికకు సంబంధించిన వివరాలు మాత్రం ఇవ్వలేదు.
దిగ్గజ టెక్ సంస్థలు నిరంకుశ విధానాలతో దేశంలో స్వేచ్ఛా ప్రసంగంపై దాడి చేశాయని హారింగ్టన్ అన్నారు.అయినప్పటికీ ట్రంప్ అమెరికన్ ప్రజలను చేరుకోవడానికి రంబుల్ వేదిక అవుతుందని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు ట్రంప్ అధికారిక ఖాతాను రంబుల్ సీఈవో క్రిస్ పావ్లోవ్‌స్కి ధ్రువీకరించారు.అయితే దీనిపై మరిన్ని వివరాలు అందించడానికి ఆయన నిరాకరించారు.

యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా చెబుతున్న రంబుల్‌ను 2013లో కెనడియన్ టెక్ పారిశ్రామిక వేత్త పావ్లోవ్‌స్కి ప్రారంభించారు.దీనికి అమెరికా సంప్రదాయవాదుల నుంచి మంచి స్పందన లభించింది.బిలియనీర్ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటలర్ థీల్, జేడీ వాన్స్‌లు ‘‘రంబుల్’’లో పెట్టుబడులు పెట్టారు.

కాగా, డోనాల్డ్ ట్రంప్ జూలై 3న ఫ్లోరిడాలో ‘సేవ్ అమెరికా’ పేరుతో ర్యాలీ నిర్వహించనున్నారు.సరసోటాలో ర్యాలీ జరుగుతుందని బుధవారం ట్రంప్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.ర్యాలీని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఫ్లోరిడా స్పాన్సర్ చేస్తుందని పేర్కొంది.