హోరాహోరీగా సాగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్యానెల్ విజయం సాధించింది.తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై ఆయన 1758 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
నిరంజన్‌కు 10, 866 ఓట్లు లభించగా, నరేన్‌కు 9,108 ఓట్లు లభించాయి.‘‘ కొడాలి ఓడాలి’’ అన్న నినాదంతో నిరంజన్ శృంగవరపు అమెరికా అంతటా చేసిన ప్రచారానికి ఓటర్ల నుంచి మంచి ఆదరణ లభించింది.
అటు మాజీ అధ్యక్షుల మద్దతు, మహిళలు-వైద్యులు-యువకుల మిశ్రమంగా ఏర్పడిన సంపూర్ణ సమగ్ర ప్యానెల్ కావడం, ఆంధ్రా-తెలంగాణా-రాయలసీమకు చెందిన ముగ్గురు పెద్దల నాయకత్వం, తానాలో మార్పు నినాదం, కొత్త సభ్యుల ఓట్లు కలగలిసి నిరంజన్ విజయం సులవైంది.ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటినీ కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది.
తానాలో మొత్తం 33,875 మంది ఓటర్లు ఉండగా, 21 ఓట్లు పోలయ్యాయి.వీటిలో 2,800 ఓట్లు చెల్లనివగా గుర్తించారు.
నరేన్ కొడాలికి తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీష్ వేమన మద్ధతుగా నిలిచారు.ఇక మరో అభ్యర్ధి శ్రీనివాస గోగినేని మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు.
ఆయనకు 1000 ఓట్లు లభించాయి.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన శృంగవరపు నిరంజన్ అమెరికాలోని మిచిగాన్‌లో స్థిరపడ్డారు.
తానా ఆవిర్భావం:

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం ఎక్కువైంది.అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోనూ తెలుగువారు వున్నారు.ఇక వారి వారి పిల్లలతో మన తెలుగు సంతతి బాగా పెరిగిపోయింది.అలా అక్కడున్న వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడంతో పాటు తెలుగు వారిలో ఐకమత్యాన్ని పెంపొందించడానికి పుట్టిందే “తానా” సంస్థ.
డాక్టర్ గుత్తికొండ రవీంద్రనాథ్ 1977లో తానాకు అంకురార్పణ చేశారు.ప్రస్తుతం 49 వేల సభ్యులు, 2 వేల మంది వాలంటీర్లతో ఈ సంస్థ మహా వృక్షంగా ఎదిగింది.
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి సేవ చేస్తూనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోనూ ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టింది తానా.
ఇక, ప్రతి రెండేళ్లకోసారి అట్టహాసంగా నిర్వహించే “తానా” మహాసభలకు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.
తానా సభలకు వెళ్లడాన్ని గౌరవంగా భావించేవారు ఎందరో.ఈ సందర్భంలోనే తానా పాలకమండలి ఎన్నికలు సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
ఎన్నికల తేదీ వెలువడింది మొదలు ఫలితాలు వెలువడే వరకు అమెరికాతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.