కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం పడరానిపాట్లు పడుతోంది.లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
పాలకులు రాజకీయాలకు ప్రాధాన్యతనివ్వడం, జనం అంతకుమించి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇండియాకు శాపంలా మారింది.దానికి ఫలితమే కోవిడ్ విశ్వరూపం.
మొదటి దశలో కోవిడ్ సోకినా పది రోజుల్లో ఆ వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవాడు.కానీ సెకండ్ వేవ్‌లో వైరస్ మ్యూటేషన్ కారణంగా అతనికి 20 రోజులైనా స్వస్థత చేకూరడం లేదు.
దీని వల్ల ఆసుపత్రుల్లో బెడ్లకు కొరత ఏర్పడింది.ఈ స్థాయిలో సెకండ్ వేవ్ వుంటుందని ఊహించలేని కారణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తిదారైన భారత్ ఇప్పుడు వ్యాక్సిన్, మందుల కోసం తోటి దేశాల సాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
అయితే క్లిష్ట పరిస్ధితుల్లో ప్రపంచానికే అండగా నిలబడిన ఇండియా కోసం అంతర్జాతీయ సమాజం బాసటగా నిలవడం శుభపరిణామమనే చెప్పాలి.ఇదే సమయంలో ప్రవాస భారతీయులు సైతం జన్మభూమి కోసం రంగంలోకి దిగారు.
ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, మందులు, రెమ్‌డిసివర్ ఇంజెక్షన్లు, వైద్య పరికరాలతో పాటు భారీ విరాళాలను పంపుతున్నారు.
అయితే వారంతా ఎక్కడో సూదర ప్రాంతాల నుంచి భారత్‌కు సాయం చేస్తే.
ఓ ఎన్ఆర్ఐ యువకుడు మాత్రం స్వదేశానికి వచ్చి మరి కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నాడు.అంబులెన్స్‌లు లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం తన సొంత కారునే అంబులెన్స్‌గా మార్చి, తానే డ్రైవర్‌గా మారాడు.
అంతేనా కొద్దిపాటి దూరానికే లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఈరోజుల్లో ఆ ఎన్ఆర్ఐ యువకుడు నయా పైసా కూడా తీసుకోకుండా సేవలు చేస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.
హైదరాబాద్‌కు చెందిన తరుణ్ కప్పాల అనే ఎన్నారై అమెరికాలోని డెలాయిట్‌లో టెక్నికల్ ప్రాజెక్ట్ మెనేజర్‌గా పని చేస్తున్నాడు.ఈ నేపథ్యంలో తన తల్లికి అనారోగ్యంగా వుండటంతో హైదరాబాద్‌కు వచ్చాడు.
అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇక్కడి దారుణ పరిస్థితులు అతనిని ఆలోచింపజేశాయి.ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకపోవడం వంటి వాటిని కళ్లారా చూశాడు.
ఇదే సమయంలో ఓ సంఘటన తరుణ్‌లోని మానవత్వాన్ని నిద్రలేపింది.కోవిడ్ కారణంగా మరణించిన తన స్నేహితుడి తల్లిని అంత్యక్రియల కోసం తరలించడానికి అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా రూ.34 వేలు వసూలు చేయడాన్ని గమనించాడు.పేదలు ఇంత భారీ మొత్తం చెల్లించి తమవారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం గానీ, ఇంటికి తీసుకురావడం గానీ చేయడం వారి ఆర్ధిక స్తోమతకు మించిన పని అని భావించాడు.
అంతే.అమెరికాలో ఉన్న తన స్నేహితుల సహకారంతో ఓ వ్యాన్ కొనుగోలు చేసి, దాన్ని అంబులెన్స్‌గా మార్చేశాడు.అందులో ఆక్సిజన్ సిలిండర్ కూడా ఏర్పాటు చేశాడు.దీనిలోనే అత్యవసర స్థితిలో వున్న కరోనా రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్నాడు.
ఈ విధంగా గత వారం రోజుల్లో 24 ట్రిప్పులు తిరిగినట్లు తరుణ్ వెల్లడించాడు.ఆసుపత్రుల వద్ద వారిని దించేసి చేతులు దులుపుకోకుండా రోగులకు బెడ్ దొరికే వరకు తరుణ్ అక్కడే ఉంటున్నాడు.
క్లిష్ట పరిస్ధితుల్లో ఆయన చేస్తున్న సాయం పట్ల నెటిజన్లు, స్థానికులు తరుణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు
.