నేటికాలంలో చిన్న వయస్సు నుండే వ్యాధులు చుట్టుముట్టుతున్న విషయం తెలిసిందే.మనుషులు మందులతో బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.
మరి ఇలాంటి దుస్దితికి కారణం మనం తీసుకునే ఆహారం.ప్రస్తుతం అన్నీ కలుషితం అయిన పదార్ధాలనే నిత్యం వాడుతున్నాం.
అదీగాక రైతులు పండించే పంటల్లో ఎరువులను ప్రమాదకర స్దాయిలో వాడటం వల్ల లేనిపోని రోగాల బారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది.
ఇకపోతే తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు చేసిన పరీక్షల్లో ఇక్కడి పంట భూముల్లో భాస్వరం మోతాదు ప్రమాదకర స్థాయిలో ఉందని తేలిందట.
ఇలా రాష్ట్రంలోని 11 జిల్లాల పరిధిలో 207 మండలాల భూముల్లో భాస్వరం పరిమితి మోతాదుకు మించిపోయినట్లు వీరు స్పష్టం చేశారు.ఇలాంటి పరిస్థితి దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని, కానీ ఏపీలోని కృష్ణా జిల్లా, ఛత్తీస్ గఢ్ లోని, బీజాపూర్ జిల్లా పరిధి నేలల్లో మాత్రమే తెలంగాణ స్థాయిలో భాస్వరం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇకపోతే వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రెండేళ్లకు ఓ సారి మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్ లో పరీక్షిస్తారు.ఈ క్రమంలో తెలంగాణలో పత్తి, మిరప, పసుపు వరి పంట సాగులో అవసరానికి మించి రసాయన ఎరువులు కుమ్మరిస్తున్నారని, భాస్వరం మోతాదు పెరగడానికి అదే కారణం అని తేలిందట.
ఇక కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని మండలాల్లో మోతాదుకు మించిన భాస్వరం నిండి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.ఈ పరిస్దితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.