ఏపీలో కరోనా కేసులు చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి.రోజూ కరోనా కేసులు వేలల్లో నమోదవుతున్నాయి.
ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాలు, జైళ్లు, ప్రస్తుతం ఆలయాల్లో ఈ సంఖ్యలో కొనసాగుతూనే ఉంది.
తాజాగా విజయవాడ దుర్గమ్మ గుడి ఆలయంలో సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.ఆలయంలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారితో పాటు మరో ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.ఆలయాలకు సడలింపులు ఇవ్వడంతో భక్తుల రద్దీ పెరిగింది.
కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చింది.ఆలయంలో కరోనా నిబంధనలు పాటించినప్పటికీ కరోనా వ్యాప్తి చెందటంతో ఆలయ సిబ్బందితో పాటు భక్తులు ఆందోళన చెందుతున్నారు.
సిబ్బంది భక్తులను అనుమతించేటప్పుడు మాస్కులు ధరించి, శానిటైజేషన్ చేసినా కొత్త కేసులు నమోదవుతున్నాయని వాపోతున్నారు.
ఇప్పటికే ఆలయ వేద పండితుడు, ఓ ఉద్యోగి కరోనా బారిన పడి మృతి చెందారు.
కరోనా కేసులు నమోదవుతుండటంతో ఆలయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లేదా ఆలయాన్ని మూసివేయాలని సిబ్బంది, అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.దుర్గమ్మ దేవాలయంతో పాటు శ్రీశైలం, అన్నవరం, తిరుపతి దేవస్థానాల్లో సైతం కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.







