తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ గుంటూరు జిల్లాలో టీ 20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది.స్థానిక కిట్స్ కాలేజీ యాజమాన్యంతో కలిసి నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో దాదాపు 20 కాలేజీల నుంచి క్రికెట్ ఆటగాళ్లు తమ క్రీడా ప్రతిభను చాటేందుకు పోటీపడ్డారు.
ఫైనల్స్ వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన టోర్నమెంట్ లో చుండి రంగనాయకులు కాలేజ్ టీం విజేతగా నిలవగా… వీవీఐటీ కాలేజ్ రన్నరప్ గా నిలిచింది.ఈ టోర్నమెంట్‌లో విజేతలతో పాటు అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు రాజ్యసభ మాజీ సభ్యులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్,గ్లో ఫౌండేషన్ కార్యదర్శి వెంకన్న చౌదరి, ఏపీఎన్.
ఆర్.టి ఛైర్మన్ వెంకటరెడ్డిల చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగింది.

ఈ టోర్నమెంట్ లో క్రీడాస్ఫూర్తిని చాటిన ఆటగాళ్లను నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అభినందించారు.ఈ టోర్నమెంట్ విజయవంతానికి కృషి చేసిన కిట్స్ కాలేజీ ఛైర్మన్ కోయ సుబ్బారావు, కార్యదర్శి శేఖర్, ప్రిన్సిపల్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ కె.వెంకట్రావులను నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.నాట్స్ చేపట్టే కార్యక్రమాలకు కిట్స్ యాజమాన్యం ఇస్తున్న మద్దతును కొనియాడారు.
తెలుగు విద్యార్ధుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఇటు ఇండియాలో అటు అమెరికాలో కూడా అనేక క్రీడా టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు.