తమ దూకుడుకు అడుగడుగున బ్రేకులు వేస్తూ, తాము తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తప్పు పట్టడమే కాకుండా, ప్రజల్లో కి దానిని తీసుకువెళ్లి తమ ముందర కాళ్లకు బంధం లా మారిన టిడిపి అధినేత చంద్రబాబును రాజకీయంగా దెబ్బకొట్టేందుకు చాలా కాలంగా ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు.అయితే ఎప్పటికప్పుడు అధికార పార్టీ వ్యూవాహాలను అడ్డుకుంటూనే, తమ పార్టీ పలుకుబడిని పెంచుకునే విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
ఏపీ రాజధాని విషయంలోనూ అదే విధంగా వైసిపి తీసుకున్న నిర్ణయాలకు అడ్డుపడుతూ అమరావతి ప్రాంతంలో ఆందోళనలు, ధర్నాలు చేయిస్తూ బాబు చాలా వరకూ సక్సెస్ అయ్యారు.దీనికి విరుగుడుగా ఇప్పుడు చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలో మూడు రాజధానుల కు మద్దతుగా వైసీపీ ఈరోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది.

ఈ సభ ద్వారా చంద్రబాబు దూకుడుకు బ్రేక్ వేయాలని వైసీపీ ప్లాన్ చేసుకుంటోంది.అందుకే ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేయడంతో పాటు, పెద్ద ఎత్తున జన సమీకరణకు తెర తీసింది.ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు ముఖ్య అతిథులుగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు తదితరులు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా చంద్రబాబుకు సొంత గ్రామం లోని మద్దతు లేదు అనే విషయాన్ని వైసిపి రుజువు చేయాలని చూస్తోంది.

దీనికి పోటీగా టిడీపి కూడా నారావారిపల్లెలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటోంది.ఈ మేరకు నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాల్సిందిగా చంద్రగిరి పోలీసులను టిడిపి కార్యకర్తలు అభ్యర్థించారు.అయితే దీనిపై పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.అయినా నిరసన కార్యక్రమాలు చేపట్టే విధంగా టిడిపి సన్నాహాలు చేస్తుండగా, వైసీపీ మాత్రం సుమారు 25 వేల మంది జనాభాతో ఈ సభను సక్సెస్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాజధానులకు మద్దతుగా ఈ సభను సక్సెస్ చేసి చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
.






