టాలివుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయిన తాప్సి పన్ను కి ఇప్పుడు ఒక బయోపిక్ లో నటించే అవకాశం రానున్నట్లు తెలుస్తుంది.ప్రపంచ మహిళా క్రికెట్ లోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ మిథాలీ రాజ్.
ఈమెకు క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి, అంతేకాకుండా మహిళా క్రికెట్ పై ప్రజల్లో ఒక ఆసక్తి కలిగించడం తో మిథాలీ పాత్ర చాలానే ఉంది.

అలాంటి మిథాలీ ఇటీవల టీ 20 లకు గుడ్ బై చెప్పిన విషయం విదితమే.అయితే ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ తీయాలని వయాకామ్ 18 సంస్థ ప్రయత్నాలు చేస్తుంది.ఈ క్రమంలోనే ఆమె పాత్రలో ఏ నటి అయితే న్యాయం చేస్తుంది అన్న నేపథ్యంలో తాప్సి పేరు పరిగణలోకి వచ్చినట్లు తెలుస్తుంది.
విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న తాప్సీ.మిథాలీ పాత్రకి సరిగ్గా సరిపోతుందనే ఆలోచన వయాకామ్ 18 సంస్థ కు వచ్చిందట.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ అతి త్వరలోనే చిత్ర దర్శకుడితో పాటు, చిత్రంలో ప్రధాన పాత్ర పోషించేది ఎవరు అనే దానిపై ఆ సంస్థ ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.తాప్సీ చివరిగా శాండ్ కీ ఆంఖ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇందులో 70 ఏళ్ళ వయస్సున్న వృద్దురాలిగా కనిపించి అలరించిన తాప్సి ఇప్పుడు ఈ బయోపిక్ లో కూడా అవకాశాన్ని దక్కించుకోగలుగుతుందో చూడాలి.