ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతూ నిత్యం అధికార పార్టీ వైసీపీకి ఇబ్బందికరంగా మారిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అన్ని విధాలా ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది.ప్రజా సంక్షేమం కోసం తాము ఎంతగా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఆ క్రెడిట్ తమకు రాకుండా అడ్డుకుంటుంది అన్న భావనలో వైసీపీ ఉంది.ప్రస్తుతం అసెంబ్లీ లో టీడీపీ బలం 23 కాగా వైసీపీ బలం 151 .23 సీట్లతో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలన్న ఆలోచనలో వైసీపీ ఉంది.అధికార పార్టీని నిలదీయడంతో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తూ వైసీపీని ఇరుకునపెట్టే ప్రశ్నలు వేస్తూ ఇబ్బందికి గురిచేస్తున్నాడు.
బాబు వేస్తున్న ప్రశ్నలకు అధికార పార్టీ సభ్యులు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పై పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా ఉన్న చంద్రబాబు అడుగడుగునా అధికార పార్టీకి అడ్డుతగులుతున్నాడు.దీంతో టీడీపీకి విపక్ష హోదా లేకుండా చేస్తే సభలో తమకు ఎదురుండదన్న ఆలోచనలో వైసీపీ ఉంది.ప్రస్తుతం తెలంగాణాలో అధికార పార్టీ టీఆర్ఎస్ నడిచిన బాటలోనే నడిచి టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.
అక్కడ కాంగ్రెస్ కు విపక్ష హోదా లేకుండా చేయడానికి ఆపరేషన్ ఆకర్ష్ ను సమర్థంగా టీఆర్ఎస్ వాడుకుంది.మొదట్లో విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవాలంటే వారు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలి అనే రూల్ ను పెట్టిన సీఎం జగన్ ఇప్పుడు ఆ కండీషన్ పై నిబంధనలు సడలించినట్టుగా కనిపిస్తోంది.
దీనిలో భాగంగానే ఆపరేషన్ సెవెన్ కు వైసీపీ శ్రీకారం చుట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మేరకు టీడీపీ నుంచి ఏడుగురు ఎమ్యెల్యేలకు తక్కువ కాకుండా చేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.అయితే టీడీపీ నుంచి వచ్చి చేరే ఎమ్మెల్యేలు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తే మళ్లీ వాళ్లను ఉప ఎన్నికలో గెలిపించుకునే బాధ్యతను పూర్తిగా వైసీపీ తీసుకుంటుంది అనే విషయాన్ని వారికి హామీగా ఇస్తున్నట్టు తెలుస్తోంది.ఆ వరసలో ముందుగా గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను చేర్చుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక రెండో టార్గట్ గా విశాఖ నార్త్ టీడీపీ ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ సౌత్ నుంచి విజయం సాధించిన వానపల్లి గణేష్, ఈస్ట్ నుంచి విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ, ప్రకాశం జిల్లా నుంచి కరణం బలరాం తదితరుల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.