హుజూర్ నగర్ ఉప ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలి అన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందుకోసం అన్ని దారులను వెతుకుతోంది.ఇప్పటికే తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి టిఆర్ఎస్ సిపిఎంతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచి తీరాలన్న కసిమీద ఉంది.
అందుకే ఏపీ రాజకీయాల్లో ఫెయిల్ అయినా వ్యక్తిగతంగా క్రేజ్ పోగొట్టుకోని పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకుని ఎన్నికల్లో గట్టెక్కాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంత రావు జనసేన ఆఫీస్ కి వెళ్లి విజ్ఞాపన పత్రాన్ని జనసేన తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ , పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు అర్హం ఖాన్ , పార్టీ అధ్యక్షుడు రాజకీయ కార్యదర్శి ఇ హరిప్రసాద్ లకు అందించి ఆ మేరకు వారితో చర్చలు జరిపారు.
ప్రస్తుతం పవన్ ఎవరికీ అందుబాటులో లేరు.కేరళలో నడుము నొప్పికి చికిత్స తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విజ్ఞప్తిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారా అనేది ఆసక్తిగా మారింది.కాంగ్రెస్ అనుకుంటున్నట్లుగా జనసేన మద్దతు ఆ పార్టీకి లభిస్తే హుజూర్ నగర్ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా ఉంటుంది.
హుజూర్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తున్నారు.అయితే ఏపీలో బలం, బలగం ఉన్నా కేవలం ఒక సీటుతో మాత్రమే జనసేన సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక తెలంగాణలో పెద్దగా బలం లేని జనసేన మద్దతు ఆ పార్టీకి లభిస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చర్చగా మారింది.టీఆర్ఎస్ సిపిఎం పొత్తు తో వెళ్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులతోపాటు ఆయన సామాజిక వర్గం నేతలు తమకు అన్నివిధాలా అండగా నిలబడతారని కాంగ్రెస్ భావిస్తోంది.
అయితే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే విషయంలో పవన్ తన అభిప్రాయం ఏంటో ఇప్పటివరకు తేల్చలేదు.ఒకవేళ మద్దతు ఇచ్చినా కాంగ్రెస్ తరుపున ప్రచారానికి వస్తారా అనేది పెద్ద సందేహంగానే కనిపిస్తోంది.ఒకవేళ పవన్ ప్రచారానికి వస్తే టీఆర్ఎస్ పై విమర్శలు చేయాలి.ప్రస్తుతం పవన్ ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీతో సున్నం పెట్టుకుంటాడా అనేది పెద్ద సందేహంగానే కనిపిస్తోంది.
తనతో ఎవరూ జట్టు కట్టడంలేదని, ఒంటరితనంతో కుమిలిపోతోంది కాంగ్రెస్.పవన్ మద్దతు ఇస్తే సినీ గ్లామర్, సామాజిక లెక్కలు తమకు పక్కాగా ఉపయోగపడతాయని భావిస్తోంది.
అందుకే పవన్ మద్దతు కోసం అంతగా ఆరాటపడుతూ విమర్శలపాలవుతోంది కాంగ్రెస్ పార్టీ.కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే విషయంలో పవన్ నిర్ణయం ఏంటా అని అంతా ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు.