ప్రముఖ సినీ నటుడు విశాల్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు తెలుస్తుంది.టీడీఎస్ ను సక్రమంగా చెల్లించని కారణంగా చెన్నై కోర్టు ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
విశాల్‌కు చెందిన ‘విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ’ కార్యాలయం చెన్నై వడపళనిలో ఉంది.అయితే ఐదేళ్లుగా ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఇచ్చిన వేతనాల్లో మినహాయించిన పన్ను (టీడీఎస్)ను సక్రమంగా ఆదాయ పన్ను శాఖకు చెల్లించని కారణంగా దీనిపై విచారణ కోరుతూ గతంలో అధికారులు పలు మార్లు నోటీసులు జారీ చేశారు.

అయితే విశాల్ ఆ నోటీసులకు స్పందించకపోవడం తో విశాల్‌పై చర్యలు చేపట్టాలంటూ ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది.అప్పట్లో దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 2న విచారణకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలంటూ విశాల్‌ను ఆదేశిస్తూ సమన్లు పంపింది.శుక్రవారం విశాల్ హాజరు కాకపోవడం తో కోర్టు కారణం అడుగగా ఐటీ అధికారులు పంపిన నోటీసు విశాల్‌కు అందలేదంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.అంతేకాకుండా ఈ కేసులో నేరుగా హాజరుకావడం నుంచి విశాల్ కు మినహాయింపు ఇవ్వాలని కూడా కోరడం తో ఐటీ తరపు న్యాయవాది వ్యతిరేకించారు.
అయితే ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి విశాల్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ తీర్పు వెల్లడించారు.
అలానే ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 28 వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తుంది.
ఇటీవల నటుడు విశాల్ కు అన్నీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో కూడా విశాల్ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
ఇప్పుడు తాజాగా అతడికి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం తో మరోసారి విశాల్ విషయం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.