బెలూచిస్తాన్ లోని క్వెట్టా లో పోలీసు వాహనాలు లక్ష్యంగా భారీ పేలుడు సంభవించింది.నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని బచఖాన్ చౌక్‌లో పోలీస్ వాహనం సమీపంలో పేలుడు సంభవించినట్లు డీఐజీ అబ్దుల్లా రజాక్ తెలిపారు.
పెట్రోలింగ్ వెహికిల్‌కు సమీపంలో ఉన్న మోటార్ సైకిల్‌కు బాంబును అమర్చి రిమోట్ ఆధారంగా పేల్చినట్లుగా అధికారులు తెలిపారు.ఈ పేలుడు ఘటనలో ఇద్దరు పోలీసులతో సహా ఐదుగురు మరణించగా,మరొక 38 మంది తీవ్ర గాయాల పాలైనట్లు తెలుస్తుంది.
పోలీసు వాహనం లక్ష్యంగా కొందరు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బచ్చా ఖాన్ చౌక్ వద్ద పేలుడు సంభవించిందని, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ ఓ) లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
అయితే ఈ ఘటనలో ఆయన గాయాలతో తప్పించుకోగలిగారని ప్రస్తుతం చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు.ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
మరోపక్క ఈ బాంబు దాడికి పాల్పడింది తామేనని నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ సంస్థ ప్రకటించుకుంది.ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులు అందరూ కూడా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.
దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.







