జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం గందరగోళంలో ఉన్నట్టు కనిపిస్తోంది.రాజకీయం గా ఇప్పటికే తప్పటడుగులు వేసెయ్యడంతో ఇకపై అడుగులు ఏ విధంగా వేయాలి అనే విషయంలో క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు ? ఏ పార్టీలోనైనా జనసేనను విలీనం చేస్తారా ? లేక మరేదైనా పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుందా ఇలా అనేక విషయాల్లో అభిమానులకు, కార్యకర్తలకు క్లారిటీ లేకుండా పోయింది.ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత పవన్ పార్టీని పటిష్టం చేసేందుకు కమిటీలు వేస్తానని, పార్టీని పటిష్టం చేస్తానని ఇలా ఎన్నో చెప్పారు.
కాకపోతే ఇప్పటివరకు ఆ దిశగా అడుగులయితే పడలేదు.పవన్ మరో ఐదేళ్లపాటు పార్టీని ముందుకు నడిపించాలి.ఇప్పటి వరకు తనతో ఉన్న నాయకులు ఎవరూ తనను విడిచిపెట్టి వెళ్లకుండా చూసుకోవాలి.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే టీడీపీ కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు.ఈ నేపథ్యంలో పవన్ కాస్త గట్టిగా ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికలనాటికి అవకాశం దక్కే ఛాన్స్ ఉండొచ్చు.అంటే ఇప్పటి నుంచి ఆయన ప్రజా క్షేత్రంలో ఉంటే రాబోయే అయిదేళ్ల లో ఓ ఫోర్స్ గా మారవచ్చు అన్న నమ్మకం అయితే కార్యకర్తల్లో ఉంది.
మరి పవన్ కల్యాణ్ కార్యక్షేత్రంలోకి ఎపుడు వస్తారో, పార్టీని మొత్తం కదిలించి పోరాటాలకు ఎలా సమాయత్తం చేస్తారో ఇవన్నీ ఎవరికీ అంతుపట్టడంలేదు.పార్టీని నడిపించాలంటే చిన్న విషయం కాదు.
అందులో ఒకసారి దారుణంగా ఓడిన పార్టీ మీద డబ్బులు పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చే అవకాశం కూడా తక్కువే.

ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా పార్టీ పెట్టిన పవన్ కు రాబోయే రోజుల్లో ఎన్నో సవాళ్లు ఉంటాయి.కాకపోతే బలమైన సామాజిక వర్గం పవన్ కి ఉండడం అనుకూలంగా ఉన్నాయి.అయితే నిధుల సమస్యను పవన్ ఎలా అధిగమిస్తాడు అనేది కీలకంగా మారబోతోంది.
పవన్ ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని భావించిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విరాళాల సేకరణకు దిగుతున్నారు.దాదాపుగా వంద కోట్ల రూపాయలను విరాళంగా సేకరించి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు కానుకగా ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
జనసేనకు ఆర్థిక కష్టాలు కనుక తొలిగిపోతే పవన్ దృష్టి మొత్తం పార్టీ పటిష్టం చేయడంపైనే పెడతారనే నమ్మకంతో పవన్ ఫ్యాన్స్ ఉన్నారు.







