తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది.సంక్రాతి కి ముందు ఉండాల్సిన ఈ వాతావరణం కాస్త ఆలస్యంగా పండుగ తరువాత మొదలయ్యింది.వాస్తవంగా… నామినేషన్ల ముందు అభ్యర్థులను ఖరారు చేసే అలవాటు … ఆనవాయితీని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు కొనసాగిస్తూ వస్తున్నాడు.అయితే… మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యం… తెలంగాణాలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉపయోగించిన ఫార్ములా వర్కవుట్ అవ్వడంతో… అదే ఫార్ములా ఉపయోగించి గట్టెక్కాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడు.దీనిలో భాగంగానే… కొంతమందికి అప్పుడే టికెట్లు ఖరారు చేస్తున్నాడు.అయితే సిట్టింగ్ లు ఈ సారి తమకే టికెట్ అని ధీమాగా ఉండగా … ఆశావాహులు కూడా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
టికెట్ల ఖరారు అధికారికంగా ప్రకటించినప్పటికీ కొంత మంది నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో.టికెట్లు వచ్చినట్లు వారు తమ నియోజకవర్గాల్లో ప్రకటించుకుంటున్నారు.ఇలా తొలి టికెట్‌ను ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఎన్నారై మహిళ షబానా ఖాతూర్ దక్కించుకున్నారు.ఈమె విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె.బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుంది అని ఓ వెబ్ ఛానెల్ ఇంటర్వ్యూ లో చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నాడు.అదీకాకుండా వయోభారం కూడా తోడవ్వడంతో ఆయన కుమార్తెకు టికెట్ ఖరారు చేశారు.
అలాగే… ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా … తన అభ్యర్థిత్వాన్ని ఈసారి ముందే ప్రకటించుకున్నారు.తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెడుతున్నారు.అలాగే సినీ నటులు పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి బారులు తీరుతున్నారు.ఇప్పటికే సినీ నటుడు అలీ చంద్రబాబు చుట్టూ తిరిగేస్తున్నారు.తనకు గుంటూరు -1 టికెట్ కేటాయించాలంటూ…ఆయన కోరుతున్నారు.
దాదాపు ఈ సీటు ఆయనకు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.ఇక కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి నిన్న పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడంతో ఆ స్థానం కోసం కోసం అప్పుడే పోటీ మొదలయ్యింది.ఈ స్థానం కోసం తానా అధ్యక్షుడు సతీష్ వేమన అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు.వీరే కాకుండా… మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా రంగంలోకి దిగారు.అయితే చంద్రబాబు ఇప్పటికే … ఒక లిస్ట్ తయారుచేసుకున్నట్టు … దాని ప్రకారం ఒక్కొక్కరు ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది.