అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇప్పుడు ఎన్నికల ఫీవర్ పెరిగిపోయింది.ఒక పార్టీ నుంచి మరో పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.అధికార టిడిపి జనవరిలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధం అవుతుంటే… దానికి కౌంటర్ గా వైసీపీ అధినేత జగన్ కూడా సిద్దమయ్యాడు.అందుకే… పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన సభలో …ఈ రోజు కొంత మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయంలో వెనుకబడినట్టు కనిపిస్తున్న జనసేన అధినేత పవన్ తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గురించి కొంతమేర క్లారిటీ ఇచ్చేశారు.
అసలు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు ఎలా ఉండాలో కూడా పవన్ బయటపెట్టేశారు.నిన్న కర్నూలు జిల్లాలో జరిగిన జనసేన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడిన పవన్ దీనికి సంబంధించి సంచలన విషయాలు బయట పెట్టాడు.రాబోయే ఎన్నికల్లో దాదాపు 60 శాతం టిక్కెట్లు కొత్తవారికి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా 20 శాతం భావజాలం ఉన్న వారికి మరో 20 శాతం విలువలు ఉన్న వారికి టిక్కెట్లు ఇవ్వబోతున్నట్లు పవన్ ప్రకటించేశారు.కొత్తవారికి ఎన్ని స్థానాలు కేటాయించాలి అనే విషయం పైన క్లారిటీ గా చెప్పారు.
పార్టీలో మొత్తం కొత్త వాళ్ళు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని… దీని కారణంగానే పార్టీలో సీనియర్ లీడర్లు అవసరం ఉందని పవన్ చెప్పారు.
జనసేనను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొద్దిరోజుల్లోనే తాత్కాలిక కమిటీలు చేయబోతున్నామన్నారు.ఆ తరువాత పూర్తి స్థాయి కమిటీలు వేసి నిత్యం జనసేన ప్రజల మధ్య ఉండేలా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు.ఇకపై తాను కూడా నిత్యం ప్రజల మధ్యనే గడుపుతానని ప్రకటించారు.
ప్రస్తుతం ఏపీ లో ఉన్న పార్టీల పనితీరు చూసి ప్రజలు చాలా విసుగు చెందారని… ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారని… ఆ ఆశ జనసేన తో తీరుతుందని పవన్ హామీ ఇచ్చారు.అయితే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారు అనే విషయం గురించి మాత్రం పవన్ నోరు మెదపలేదు.