తెలంగాణాలో ఎన్నికల యుద్ధం వాడి వేడిగా జరుగుతోంది.ఎవరికి వారు తమ గొప్పలు చెప్పుకుంటూ… తమ ప్రత్యర్థుల బలహీనతలను ఎత్తి చూపుతూ…ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు.
ప్రత్యర్థి పార్టీ ఒకటి ఇస్తామంటే మేము రెండు ఇస్తామంటూ హామీల వర్షంలో తడిపేస్తున్నారు.ఎన్నికల సమయంలో ఇదంతా… రొటీన్ గా ఉండే విషయమే.
ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటి అంటే… తెలంగాణాలో దాదాపు 24 నియోజకవర్గాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్నారు.ఎప్పుడో దశబ్దాల క్రితం ఇక్కడకి వచ్చి స్థిరపడిపోయారు.అయితే… ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు వస్తున్న ఆలోచన ఒక్కటే.అదేంటి అంటే… తెలంగాణ లో నివసిస్తున్న సీమాంద్రుల ఓట్లు ఎటు వైపు పడతాయన్నదానిపై అందరిలోనూ ఆసక్తి… ఆలోచన రెండు ఏర్పడ్డాయి.
సీమాంధ్రుల ఓట్లను గంపగుత్తగా కొట్టేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.గత ఎన్నికలలో వీరిలో మెజార్టీ ఓటర్లు బిజెపి,టిడిపి కూటమి వైపు మొగ్గు చూపారు.దానికి ఉదాహరణగా టిడిపి పది సీట్లు, బిజెపి ఐదు సీట్లు హైదరాబాద్ పరిసరాలలోనే గెలుచుకున్నాయి.అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ హవా బాగా నడిచింది.అలాగే పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఇక్కడ ఉంది.అలాగే జగన్ పై ఉన్న అభిమానం కూడా ఇక్కడ పని చేసింది.
అందువల్లే ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్.పి స్థానం, మూడు అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది.కానీ ప్రస్తుతం జనసేన- వైసీపీ ఈసారి ఇక్కడ పోటీ చేయడం లేదు.దాంతో గత సారి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఓటు వేసినవారు ఏమి చేస్తారు? అలాగే జనసేన కారణంగా టిడిపి-బిజెపి కూటమికి ఓటు వేసిన వారు ఏమి చేస్తారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.
ఇక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం వారు, వీరు అని లేకుండా అంతా టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు.దాంతో రికార్డు స్థాయిలో టిఆర్ఎస్ 99 స్థానాలు గెలుచుకుంది.
అది జరిగిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి .కార్పొరేషన్ ఎన్నికలలో టిఆర్ఎస్ కు ఓటు వేసినవారు ఈసారి ఎందుకు వేయరన్న డౌటు వస్తుంది.అయితే ఇది ఒకరకంగా ప్రభుత్వాన్ని కొననసాగించడానికో, మార్చడానికో జరిగే ఎన్నికలు కావడంతో అప్పటి మాదిరిగా అందరూ ఆలోచించకపోవచ్చు.అలాగని ఆలోచించరని కూడా మనం ఊహించలేము.
అంతే కాదు … సీమాంధ్ర రాజకీయాల ప్రభావం కూడా ఇక్కడ కూడా పడేలా కనిపిస్తోంది.ఏపీలో టిడిపిని, చంద్రబాబును వ్యతిరేకించే వారంతా కాంగ్రెస్ కూటమికి ఓటు వేయడానికి ఇష్టపడకపోవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి.అయితే ఈ పరిణామాలతో టిడిపి అదినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని రంగంలో దించి ,ఆమెను అంటు నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తిగా,ఇటు సీమాంధ్రుల ప్రతినిధిగా చూపాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఇక జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కూడా తాము పోటీ చేయడంలేదని ప్రకటించారు.
దాంతో ఆయన అభిమానులు కూడా వారికి నచ్చిన పార్టీకి ఓటు వేసుకునే అవకాశం కనిపిస్తోంది.