అవసరం తీరేదాకా కాపు అవసరం తీరాక కరివేపాకు అన్నట్టు తమ పరిస్థితి తయారయ్యందని రాష్ట్రంలో ని కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ పార్టీలు కాపులను కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నాయని అందుకే రాజకీయ అవసరాల కోసం తమ కులాన్ని ఉపయోగించుకుని అవసరం తీరిపోయాక పక్కనపెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తమ కుల రిజెర్వేషన్ పై ఎదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈ నెల 25, 26వ తేదీల్లో కాపు జేఏసీ సమావేశం కాబోతోంది.కాపు ఉద్యమ నేత ముద్రగడ నివాసంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు.అధికార తెలుగుదేశం పార్టీ కేవలం ఓట్ల కోసమే కాపు రిజర్వేషన్లపై నాటకమాడిందన్న అభిప్రాయంలో కాపు జేఏసీ ఉంది.
కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు దులుపుకున్నారని, తాము ఇచ్చిన సూచనలను కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో పట్టించుకోలేదని కాపు జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
గతంలో కాపు రిజర్వేషన్లపై తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి ప్రభుత్వం పంపింది.
కేంద్రం దీనిపై అడ్డు పుల్లలు వేస్తుందని భావించిన కాపు జేఏసీ ఆ జీవోను వెనక్క తీసుకువచ్చి మార్పులు, చేర్పులు చేసి గవర్నర్ చేత ఆమోదింప చేసి రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని చంద్రబాబును కోరింది.ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోపు ఈ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
అలా జీవో అమలు చేస్తే చంద్రబాబు వెంటే కాపులు ఉంటారని, టీడీపీ విజయానికి తామంతా అండగా ఉంటామని వారు విన్నవించారు.

అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి.కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.సున్నితమైన అంశం కావడంతో దాన్ని చంద్రబాబు పక్కనపెట్టినట్లే కన్పిస్తుంది.
దీంతో కాపు జేఏసీ ఇక తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయింది.అందుకోసమే ముద్రగడ పద్మనాభం ఇంట్లో కాపు జేఏసీ సమావేశం కానుంది.
వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, కాపు రిజర్వేషన్ల అమలుపై ఎటువంటి పోరాటం చేయాలన్న దానిపై చర్చించబోతున్నారు.
కాపు రిజర్వేషన్స్ అంశంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా మోసం చేసిందన్న భావనలో జేఏసీ ఉంది.
అందుకే ఆ సమావేశం లో ఆ పార్టీ వైకిరిపై కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.అలాగే జనసేన పార్టీ విధానం ఏంటి .? వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి .? చిత్తశుద్ధితో కాపు రిజర్వేషన్స్ అమలు చేసే పార్టీ ఏది తదితర అంశాలపై ఈ సమావేశంలో ఒక క్లారిటీ తెచ్చుకోబోతున్నారు.