” అమ్మా ! కొంచెం పాపను.లగేజి చూస్తుంటారా ! బాత్రూంకి వెళ్లొస్తా !” అన్నాడు పక్కనే ఉన్నావిడను చూస్తూ.
అలాగేనని తలూపింది.రెండేళ్ల పసివాపను బెంచీపై కూర్చోబెట్టి వెళ్లాడతను.
ఆమె బస్ వచ్చే టైమైంది.కానీ అతను రాలేదు.
పాప గుక్కపట్టి ఏడుస్తోంది.ఏం చేయాలో దిక్కుతోచలేదు.
పక్కనే ఉన్న బ్యాగు నుంచి పాలడబ్బా తీసి పట్టింది.సౌందర్యలో ఆందోళన మొదలైంది.
ఎంతసేపటికీ అతను రాలేదు.ఏం చెయ్యాలి.
పసిపిల్లను వదిలేసి పోవాలా ! మనసొప్పుకోలేదు.బసు వచ్చింది.
పోయింది.పాప తండ్రి మాత్రం రాలేదు.
గంటలు గడిచిపోయాయి.సౌందర్య ఆలోచనలు పరిపరివిధాలాపోతున్నాయి.
ఇక రాడని నిర్ధారించుకుంది.బిడ్డతోపాటు లగేజి తీసుకొని బయల్దేరింది.
” నీకు బుద్ధి ఉందా ! ఎవడో పిల్లను వదిలించుకోవడానికి బస్టాండులో వదిలేస్తే.నువ్వు ఇంటికి తెస్తావా !” అత్తమామలు రుసరుసలాడారు.భర్త ఏం మాట్లాడలేదు.మౌనం అర్థం తెలీలేదు సౌందర్యకి.భర్త వైపు చూసింది.కృష్ణ మొహం తిప్పుకున్నాడు.
ఏం చెయ్యాలో తోచలేదు.స్నానం చేసి అన్నం తినకుండానే బిడ్డను పడుకోబెట్టుకుంది.
భర్త మౌనం వీడలేదు.అత్తమామ గుసగుసలు ఆగలేదు.
ఒక్కసారిగా పసిబడ్డ ఏడుపు లంకించుకుంది.గుక్కపట్టి ఏడుస్తోంది.
సౌందర్య కాళ్లూ చేతులు ఆడలేదు.భర్తను లేపింది.
ఇక లాభం లేదనుకొని ఇద్దరూ బిడ్డను తీసుకొని ఆస్పత్రికి బయల్దేరారు.డాక్టరు పరీక్షలు రాశారు.
రాత్రంతా నిద్రలేదు.ఆస్పత్రిలోనే మకాం.తెల్లారి వచ్చిన డాక్టర్ ఇద్దర్నీ తన గదిలోకి పిల్చాడు.”పాపకు బ్రెయిన్ ట్యూమర్ ! నొప్పి భరించలేక ఏడుస్తోంది ! వెంటనే ఆపరేషన్ చెయ్యాలి.లేకపోతే ప్రాణానికే ముప్పు” అని చెప్పాడు.కృష్ణకు కళ్లు తిరిగినంత పనైంది.సౌందర్య మనసు కకావికలమైంది.ఆపరేషన్‌కు రెండు లక్షలు కావాలని చెప్పారు.
కృష్ణ స్పందించలేదు.అత్తమామలకు కాల్ చేసి చెప్పింది.
వాళ్లు మనకెందుకీ పీడన్నారు.సౌందర్యకు కన్నీళ్లు ఆగలేదు.
అదే తమ బిడ్డయితే ఇలాగే మాట్లాడతారా అనుకుంది.పెళ్లయి రెండేళ్లయింది.
పిల్లల్లేరు.అంతమాత్రాన ఈ పిల్లను పెంచుకుంటామంటే.
ఎవరూ అంగీకరించడం లేదు.ఓ నిర్ణయానికొచ్చింది.
డాక్టర్ దగ్గరకెళ్లి ” ఆపరేషన్‌కు సిద్ధం చేయండి!” అని చెప్పింది.ఇంటికెళ్లి బీరువాలో నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చింది.
భర్త విస్తుపోయి చూస్తున్నాడు.అత్తమామలు ఏదో చెప్పినట్టుంది.
సౌందర్యను పక్కకు పిల్చి” పాప బావుంటే పెంచుకునే వాళ్లం.జబ్బున్న పిల్ల కదా! భవిష్యత్తులో ఎలా ఉంటుందో!” అని నసిగాడు.
సౌందర్యకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది.తనను తాను మర్చిపోయింది.” వస్తే మీ ఇంటికి పాపతోనే వస్తా ! లేదంటే మీ ఇష్టం ! మళ్లీ ఆ ఇంట్లో అడుగు పెట్టను ! నిర్ణయం మీదే!” అంటూ వార్డులోకి వెళ్లింది.
” మీ వాళ్లను కాదని పాపతో ఏం చేయదల్చుకున్నావ్ !” అమ్మానాన్నల ప్రశ్న.” చదువుకున్నా ! సమాజమేంటో తెలుసుకున్నా! నా బతుకు నేను బతుకుతా!” సౌందర్య ఉబికొస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది.కన్నోళ్లు ఏవేవో చెప్పారు.
మగాడు లేకుండా ఆడది బతకలేదన్నారు.అనుభవంలో తెలుసుకుంటావన్నారు.పోస్టు గ్రాడ్యుయేట్ చదువుకున్న సౌందర్యకు ఇవేమీ రుచించలేదు.” అమ్మా! మీరు నాకు సాయం చేయక్కర్లేదు! పాపే నా ప్రాణంగా బతుకుతా! పాపను వదిలెయ్యమనే సలహా ఇంకెప్పుడూ చెప్పొద్దు! ఉంటాను ” అంటూ బ్యాగ్ సర్దుకొని బయల్దేరింది.వాకిట్లో భర్త ఎదురొచ్చాడు.బయట నుంచి అన్నీ విన్నాడు.ఏటూ తేల్చుకోలేక ఇటు భార్యని.అటు అత్తమామల్ని బిత్తరగా చూస్తుండిపోయాడు.
బిడ్డను పొదువుకుంటూ సౌందర్య కదిలింది.గమ్యాన్ని నిర్దేశించుకుంటూ.
బిడ్డ భవిష్యత్తును ఊహించుకుంటూ !