దశాబ్దాలుగా ఎంతోమందికి వైద్య సేవలందించిన ఉస్మానియా హాస్పటల్ .అత్యంత అరుదైన ఆపరేషన్లకు వేదికగా నిలిచింది.
మొండి రోగాలు నయం చేసి ఎందరికో ప్రాణబిక్ష పెట్టింది.ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఉస్మానియా ప్రస్తుతం రోగులకు, వైద్యులకు అన్ సేఫ్ గా తయారైంది.
దాంతో అక్కడ డాక్టర్లు వినూత్న నిరసన చేశారు.అదేంటంటే తలకు హెల్మెట్లు ధరించి వైద్యులు విధులు నిర్వహించారు.
అంతేకాదు పార్కింగ్ ప్లేస్ లోనే రోగులకు వైద్య సేవలు అందించి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు తలకు హెల్మెట్లు ధరించి రోగులకు వైద్య సేవలు అందించారు.అంటే ఇదేదో హెల్మెట్ అవగాహన కార్యక్రమం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.! తరచూ పెచ్చులూడుతూ భయపెడుతున్న ఆస్పత్రి భవనంలో పని చేయలేకపోతున్నామంటూ వైద్యులు ఈ విధమైన నిరసనకు దిగారు.
వినూత్న తరహాలో చేపట్టిన ఈ నిరసన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
నెల రోజుల వ్యవధిలోనే ఐదుసార్లు పెచ్చులూడి పడ్డాయి,దాంతో ఒకవైపు డాక్టర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోగులకు సేవలు చేస్తుంటే,మరోవైపు రోగులు ప్రాణాల కోసం ఇక్కడికొస్తే ఇక్కడ ఉన్న ప్రాణం పోయేలా ఉందని భయపడుతున్నారు.
పోయిన నెలలో పెచ్చులూడి ఒక జూనియర్ డాక్టర్ పై పడడంతో గాయపడ్డాడు.అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరినా.ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని జూనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉస్మానియా బిల్డింగ్ పైఫ్లోర్లు వినియోగానికి పనికిరాకుండా పోయాయాని అధికారులు గతంలోనే తేల్చి చెప్పారని, కొత్త భవనం నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఏడాది గడుస్తున్నా.నేటికీ ఎలాంటి పురోగతి లేదు.అక్కడ విధులు నిర్వహించాలంటే ఆస్పత్రి సిబ్బంది వణికిపోతున్నారు.తరచూ భవనం పెచ్చులూడి పడుతున్న నేపథ్యంలో జుడాలు ఈవిధంగా వినూత్న నిరసన చేపట్టారు.ప్రభుత్వం చర్యలు ప్రారంభించేవరకు తమ నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.