ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల హడావుడి మాములుగా ఉండదు.ఎవరితో ఎవరికి లాభం ఉంటుందో అనే విషయాలమీద ఒక క్లారిటీ తెచ్చుకున్న తరువాతే పొత్తులకు దిగుతుంటారు.
ఎప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ హడావుడి చేసే వామపక్ష పార్టీలు ప్రతి బ్న్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటూనే ఉంటాయి.సొంతంగా ఆ పార్టీలకు బలం లేకపోవడంతో పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీలకు తప్పనిసరి.అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎవరితో దోస్తీ కట్టాలన్న విషయంలోనే వామపక్షాలు కొంత గందరగోళానికి గురవుతున్నాయి.సీపీఐ, సీపీఎం కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు ఈ అయోమయాన్ని సృష్టిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకుంటే మంచిది అనే భావనలో కేంద్ర నాయకత్వం ఉంది.కానీ దానికి భిన్నంగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచిది అనే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది.ఈ విషయంలో మరికొద్ది రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని వామపక్ష శ్రేణులు అంటున్నాయి.వాస్తవానికి సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకత్వాలు మాత్రం జనసేన అధినేత పవన్‌తో కలిసి ఉద్యమాలు చేస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో జనసేన, సీపీఐ, సీపీఎంలు కలిసి నడుస్తాయని ఆ పార్టీల నేతలు పవన్‌తోపాటు మధు, రామకృష్ణలు ఇప్పటికే ప్రకటించారు.ఉమ్మడి కార్యాచరణలో భాగంగా పలు కార్యక్రమాలు కూడా చేపట్టారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం విజయవాడలో పాదయాత్ర చేపట్టారు.ఉద్దానంలో పవన్ దీక్ష చేస్తుండగా.
వామపక్షాల నేతలు మద్దతు తెలిపారు.ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసి.
వచ్చే ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ అంటూ హడావుడి కూడా చేస్తున్నారు.కానీ పవన్ నుంచి పెద్దగా స్పందన రాకపోయినా ఈ నేతలు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు.
జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.ఇందులో వామపక్షాలతో పాటు ఏపీ నుంచి చంద్రబాబు కూడా ఉంటారనే ప్రచారం జరుగుతోంది.ఇటీవల జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లోనూ విపక్ష కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ నేతకు టీడీపీ ఎంపీలు ఓటేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక కూటమిలో చంద్రబాబు ఉంటారని, అటువంటప్పుడు వామపక్ష పార్టీలు జగన్ తో ఎలా జత కడతారని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంలో కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి మధ్య సమన్వయం కుదరడం లేదు.మరి కొన్ని రోజుల్లో ఈ విషయం పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.