గులాభీ బాస్ కేసీఆర్ లో ఎన్నికల కంగారు మాములుగా లేదు.ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఆయన తహతహలాడిపోతున్నాడు.
తాను పరుగులు పెట్టడమే కాకుండా పార్టీ నాయకులను కూడా పరుగులు పెట్టిస్తూ తెగ హడావుడి చేసేస్తున్నాడు.దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కేంద్రం హడావుడి చేయడంతో కేసీఆర్ లో మొదట ఆశలు చిగురించాయి.
కానీ ఆ తరువాత కేంద్రం ముందస్తుకు వెళ్లే అవకాశాలు కనిపించకపోవడంతో కేసీఆర్ కొంచెం నిరాశపడినా… ఆ తరువాత కేసీఆర్ ఒక సరికొత్త వ్యూహం రూపొందించుకున్నాడు.ఆగస్టు నెలలో శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.

ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలతోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కేసీఆర్ బలంగా కోరుకుంటున్నారని వార్తలు బలంగా పార్టీలో వినిపిస్తున్నాయి.ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులకు సైతం ఆదేశాలు అందినట్టు సమాచారం.దీనిలో భాగంగానే తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్లేందుకు వివిధ సంక్షేమ పథకాలను త్వరగా ప్రజల్లోకి వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.అధికారులతో పాటు పార్టీ యంత్రాంగాన్ని కూడా కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు.
డిసెంబరులో ఎన్నికలు జరిగితే అనుసరించాల్సిన వ్యూహంపై ఇటీవల సీనియర్ నేతలతో కేసీఆర్ నిత్యం చర్చిస్తున్నారు.

పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు.? ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తి గా ఉన్నారా అనే విషయాలను ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు.అలాగే సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరును కూడా సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు.
ఇప్పటికే మూడు సార్లు సర్వేలు చేయించిన కేసీఆర్ మరోసారి సర్వే చేయిస్తున్నారని చెబుతున్నారు.ఇదే ఫైనల్ సర్వే అని తెలియడంతో సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో ఆందోళన పెరిగిపోయింది.
ఇక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కరపత్రాలు, ప్రచార రథాలను సిద్ధం చేసే బాధ్యతను ఒక సీనియర్ నేతకు అప్పగించారు.







