విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్‌గా తెరకెక్కిన ‘గీతా గోవిందం’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.ఆగస్టు 15వ తారీకున చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా చిత్రం ఆడియో వేడుకను నిర్వహించడం జరిగింది.మెగా ఫ్యామిలీ ఈ చిత్రాన్ని నిర్మించిన కారణంగా సినిమా ఆడియోకు అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా హాజరు అయ్యాడు.
ఈ ఆడియో వేడుకకు హీరో విజయ్ దేవరకొండ మాస్ లుక్‌లో లుంగీతో రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.విజయ్ దేవరకొండకు అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో చిన్న షాక్ ఇచ్చి, అందరిని ఆశ్చర్య పర్చాడు.

ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మించిన విషయం తెల్సిందే.బన్నీ వాసు గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ నా సినీ కెరీర్ ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం తన తండ్రి అయితే, అంతే ప్రధానంగా బన్నీ వాసు కూడా తన సినీ కెరీర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఆయన నిర్మించిన సినిమా అవ్వడం వల్లే ఈ చిత్రం ఆడియోకు వచ్చాను అన్నాడు.విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ నీ కోసం ఈ ఆడియో వేడుకకు వచ్చాను అనుకోమాకు అని చెప్పడంతో విజయ్‌లో కాస్త రంగులు మారాయి.
ఈ సమయంలోనే ప్రేక్షకులు కూడా కాస్త కంగారు పడ్డారు.ఆ తర్వాత వెంటనే తేరుకున్నాడు.

నీ కోసం ఈ ఆడియో ఫంక్షన్‌కు రాలేదు అంటూనే విజయ్ దేవరకొండపై అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు.‘అర్జున్ రెడ్డి’ చిత్రం చూసిన తర్వాత వారం రోజుల పాటు తాను ఏదోలా అయ్యాను.నేను అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు రావాలని కోరుకున్నాను.అనుకున్నట్లుగానే మంచి నటనకు గుర్తింపు దక్కింది.విజయ్ ఆ అవార్డుకు అర్హుడు అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.ఈ చిత్రంతో విజయ్‌కి మరింత గుర్తింత గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్లుగా బన్నీ చెప్పుకొచ్చాడు.
‘పరుగు’ చిత్రం చేస్తున్న సమయంలో పరుశురాం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు.అప్పటి నుండి ఆయన్ను చూస్తూనే ఉన్నాను.ఈ కథను నేను మూడు సంవత్సరాల క్రితం విన్నాను, వారం రోజుల క్రితం సినిమాను చూశాను.ఇది అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉందని బన్నీ చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రానికి మంచి లాభాలు వచ్చి తన తండ్రి తనకు కారు కొనివ్వాలని కోరుకుంటున్నట్లుగా బన్నీ అన్నాడు.ఇక తన తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ క్లారిటీ కోరగా త్వరలోనే క్లారిటీ ఇస్తాను అంటూ ప్రకటించాడు.