టీడీపీ , వైసీపీలను ఒకేసారి చిక్కుల్లోకి నెట్టి రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేసేసాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.కొంచెం కొంచెం తన విమర్శలకు పదును పెడుతూ.
ప్రత్యర్థులను డైలమాలో పడేస్తున్నాడు ఈ జనసేనాని.తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకి పవన్ సవాల్ విసిరాడు.
పంచాయతీ ఎన్నికలు పెట్టే దమ్ముందా? అంటూ ముఖ్యమంత్రినే సవాల్ చేశారు.ఈ సవాల్ ను స్వీకరించలేక, తిప్పికొట్టలేక అధికార పార్టీ నేతలు తెగ హైరానా పడిపోతున్నారు.
టీడీపీ పని అయిపోయిందంటూ సేనాని సవాల్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన కార్యకర్తలు కాసుకుని కూర్చున్నారు.
ఏపీలో సుమారు పదమూడు వేల పంచాయతీల పాలక వర్గాలకు గడువు ఆగస్టుతో ముగియబోతోంది.
ఎన్నికలు నిర్వహిస్తే నూతన సర్పంచులు కొలువుదీరాలి.గ్రామస్థాయిలో టీడీపీ చాలా పటిష్టంగా ఉంది.
స్థానిక నాయకులను చూసి పార్టీలకు సంబంధం లేకుండా ఓటింగు జరుగుతుంది.నాయకత్వం విషయంలో వైసీపీ, జనసేనలపై టీడీపీదే ఆధిక్యం.
కానీ పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు సంసిద్ధంగా లేరు.గ్రామస్థాయి ఎన్నికల్లో వనరులు వినియోగిస్తే శాసనసభ ఎన్నికలపై స్థానిక నాయకులు పెద్దగా శ్రద్ధపెట్టరనే భయం బాబుకి ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతే ఇక ఎమ్మెల్యే,ఎంపీలను పట్టించుకోవాల్సిన అవసరం లోకల్ లీడర్లకు పెద్దగా ఉండదు.అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలే టీడీపీ కి ప్రతిష్టాత్మకం.
అందుకే ముందుగా రిస్క్ చేయడానికి చంద్రబాబు సిద్దపడటం లేదు.క్యాడర్, వనరులను ఇప్పుడే వినియోగించడం అనవసరమనే ఆలోచనలో ఆయన ఉన్నారు.

ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అధికారం తప్పనిసరిగా దక్కాల్సిందే.లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ.ఆ పార్టీ మనుగడ సాగించడం కష్టం అయిపోతుంది.రాజకీయాల్లో గెలుపోటములు సహజం.అయితే ఓటమిని ఈ దశలో తట్టుకునే పరిస్థితి వైసీపీకి లేదు.పంచాయతీల్లో అయిదేళ్లు, అసెంబ్లీలో నాలుగేళ్ల అధికారం తర్వాత కూడా టీడీపీ పంచాయతీల్లో గెలుపు సాధిస్తే ఆ పార్టీకి ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది.
వైసీపీ శ్రేణుల్లో నైతికస్థైర్యం దిగజారిపోతుంది.పైపెచ్చు వైసీపీ కంటే స్థానిక నాయకత్వం టీడీపీకి పటిష్ఠంగా ఉంది.35 సంవత్సరాలుగా పార్టీ గ్రామస్థాయిలో బలంగా ఉంది.అనుకూ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జగన్ కూడా భయపడాల్సి వస్తోంది.
ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకే గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం లేదు.ఉన్నవారంతా పవన్ అభిమానులే అందులో సగం మందికి కూడా ఓటు హక్కులేదు.
అయినా ఆ పార్టీ అధినేత ఎన్నికల సవాల్ విసురుతున్నాడు.రెండు మూడు జిల్లాలను మినహస్తే జనసేన ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండనే ఉండదు.
అయినా పవన్ సవాల్ విసురుతుండడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.బలం లేకపోయినా ఉన్నట్టు పవన్ బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.






