రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కే అవకాశమే కనిపించకపోయినా అంతో ఇంతో ప్రభావం చూపించాలని ఏపీ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.దీనికి తోడు పార్టీ హై కమాండ్ కూడా ఏపీలో అంతోఇంతో బలపడితే తరువాతి ఎన్నికలనాటికైనా ఉపయోగపడుతుందనే ఆలోచనలో ఉంది.
అందుకే టీడీపీ అధినేత చంద్రబాబుతో చీకటి ఒప్పందం పెట్టుకుని మరీ పార్టీ మనుగడ సాగించేందుకు ఆరాటపడుతోంది.అందుకే పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలకు కబురు పంపి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారు.
ఈ కోవలోనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని పార్టీలోకి టీయూకొచ్చారు.ఏపీలో పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు ఆయనకి కట్టబెట్టారు.
ఇతర నేతల చేరికల బాధ్యత కూడా ఆయనపైనే పెట్టారట.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ లోకి దిగిన ఏపీ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు వైసీపీ ని టార్గెట్ చేసేపనిలో పడ్డారు.ఈ వ్యూహమంతా కిరణ్ కుమార్ ఖరారు చేస్తున్నట్టు సమాచారం.ఇటీవల రాష్ట్రబంద్ కి వైసీపీ పిలుపునిస్తే.
రఘువీరా రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.బంద్ చేసి వైసీపీ ఏం సాధిస్తుందని ప్రశ్నించారు.
కిరణ్ సలహాతోనే వైసీపీకి వ్యతిరేకంగా రఘువీరా అంత ఘాటుగా మాట్లాడారని తెలుస్తోంది.త్వరలోనే ఏపీలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఈ సభలో కూడా జగన్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శల బాణాలు వదలాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది.

ఆంధ్రాకి న్యాయం జరగాలంటే అది జాతీయ స్థాయిలోనే తేలుతుంది.బీజేపీ ఎలాగూ ఏపీకి న్యాయం చెయ్యదు కాబట్టి ఏపీకి న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమనేది ప్రజలకు అర్థమయ్యే వివరించాలనుకుంటున్నారట ఏపీ కాంగ్రెస్ నేతలు.టీడీపీ, వైసీపీ, జనసేన వంటి పార్టీలు ఎన్ని ఉన్నా.
అవి ప్రాంతీయ పార్టీలు మాత్రమేననీ, ఎన్నికల తరువాత ఏదో ఒక జాతీయ పార్టీకి మద్దతు ఇస్తే తప్ప వారు సాధించేది ఏదీ ఉండదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.ఈ వ్యవహారాలన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోతున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పుడు కిరణ్ మీదే ఆశలన్నీ పెట్టుకుంది.







