ఏపీలో అడ్రెస్స్ గల్లంతయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏపీ సీఎం చంద్రబాబు అండతో ఆ అడ్రస్ వెతుక్కునే పనిలో పడింది.ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నించినా ఒక్కసీటు కూడా సంపాదించే సత్తా లేదని ఆ పార్టీ నేతలకు కూడా బాగా తెలుసు అయితే పార్టీ ఉనికిని కాపాడుకుని అదే సమయంలో చంద్రబాబు తో ఉన్న చీకటి ఒప్పందం మేరకు ఏపీలో మళ్ళీ బలమైన పంది వేసుకోవాలని ఆ పార్టీ చూస్తోంది.
అందుకే నెగ్గేందుకు ఆస్కారం లేకపోయినా మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలని ఆరాటపడుతోంది.దీనిలో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ ఏపీలో పర్యటిస్తూ మాజీలందరిని పార్టీలోకి తీసుకొచ్చే పనిలో పడ్డాడు.

వచ్చే ఎన్నికల్లో తమకు ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, జగన్ ను ఓడించే దిశగానే రాష్ట్ర నాయకులంతా పనిచేయాలని ఊమెన్ చాందీ కాంగ్రెస్ నాయకులకు నూరి పోస్తున్నాడు.జగన్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ భావించడం వెనుక పెద్ద రాజకీయమే దాగి ఉంది.చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో స్నేహానికి తహతహలాడుతున్న సంకేతాలు కూడా కొన్ని కనిపించాయి.కర్నాటక లో కుమార స్వామి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రాహుల్ తో చంద్రబాబునాయుడు వ్యవహారం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
రాహుల్ తో చిరునవ్వులు, భుజం తడుతూ అభినందనలు ఇవన్నీ కొత్తగా అనిపించాయి.మోడీ సర్కార్ ను వ్యతిరేకించే వారంతా మనకు మిత్రులే అంటూ చంద్రబాబునాయుడు ఆ తర్వాత కొన్ని సంకేతాలు కూడా ఇచ్చారు.
ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే.చంద్రబాబునాయుడుకు మేలు చేయడానికే కాంగ్రెస్ ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో సీరియస్ గా పనిచేస్తున్నదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.
చంద్రబాబునాయుడుకు ప్రధాన ప్రత్యర్థి జగన్ మాత్రమే.ఈ ఇద్దరిలో అంతో ఇంతో జగన్ పట్లనే కాంగ్రెస్ కు సానుభూతి ఉండాలి.
కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేరు తెచ్చుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవ విస్మరించలేనిది గనుక.అంతో ఇంతో జగన్ కు మేలు చేయాలి.
కానీ ఊమెన్ చాందీ చాలా స్పష్టంగా జగన్ నే ప్రధాన ప్రత్యర్థిగా ఎంచి.పోరాడాలని చెబుతున్నారంటే దాని వెనుక ఏదో మతలబు ఉందని గుసగుసలు ఏపీలో వినిపిస్తున్నాయి.
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా పర్వాలేదు కానీ జగన్ మాత్రం రాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావించడం వెనుక బాబు స్కెచ్ ఉందని అందరికి అర్ధం అవుతోంది.







