ఎన్నికల ఊపుతో ముందుకెళ్తున్న టీడీపీకి మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం మింగుడుపడడంలేదు.చంద్రబాబు విశాఖ పర్యటనకు ముందు తన అసమ్మతిని వెళ్లగక్కాడు.
అయితే ఆ తరువాత చంద్రబాబు ఎదో చెప్పి ఆయనను బుజ్జగించాడు.అప్పట్లో కొంచెం మొత్తబడినట్టు కనిపించిన గంటా లోలోపల మాత్రం వేరే ఆలోచనలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
సర్వేల పేరు చెప్పి గంటా శ్రీనివాస రావును ఇరుకున పెట్టడానికి ప్రయత్నించిన టీడీపీ అధిష్టానానికి రివర్స్ లో గంటా షాక్ ఇస్తున్నాడు.
టీడీపీ అధినేత ఎంత బుజ్జగించినా గంటా మాత్రం మొత్తబడకుండా తన అజెండా అమలు చేసే పనిలో పడ్డాడు.దీనిలో భాగంగానే.మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఏకాంత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కొద్దిరోజులుగా బాబుపై అసంతృప్తితో ఉన్న ఆనం.తనకు అవమానం జరిగిందని బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.
ఇదే క్రమంలో పార్టీ ప్రవర్తనతో అసంతృప్తితో రగిలిపోటున్న గంటా కలవడం, కలిసి ఏకాంతంగా చర్చించడంతో వీరి రాజకీయం ఏంటో అర్ధం కావడంలేదు.
ఆనం -గంటా చర్చలపై వారు మాత్రం దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారు.
ఆనం వివేకా మరణం నేపథ్యంలో ఆయన సోదరుడిగా తనను పరామర్శించడానికే మంత్రి గంటా వచ్చారు తప్ప తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు.గత వారం పది రోజులుగా పార్టీకి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావు హోంమంత్రి బుజ్జగింపులతో చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా అలక వీడిన సంగతి తెలిసిందే.
కానీ ఆ బుజ్జగింపులు మూడునాళ్ళ ముచ్చటగానే పనిచేసినట్టుగా కనిపిస్తోంది.పైగా జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర టీడీపీ సీనియర్ నాయకులు ఎవరూ లేకుండానే ఈ బేటీ జరగడంతో టీడీపీలో కలవరం మొదలయ్యింది.
వీరి భేటీ వెనుక ఉన్న రహస్యాలపై చంద్రబాబు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.