ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అన్ని పార్టీలు కూడా తమ వద్ద ఉన్న అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.కేంద్రంలో బీజేపీ నిన్న మొన్నటి వరకు మిత్రులను దూరం చేసుకుని ఒంటరి పోరాటం చేయాలనుకుంది.
కాని పరిస్థితి తారుమారు అయ్యిందనే ఉద్దేశ్యంతో ఎన్నికలు ఇంకా సంవత్సరం ఉండగానే మిత్రుల కాళ్ల బేరంకు సిద్దం అయ్యింది.ఇక ఏపీలో తెలుగు దేశం, వైకాపా, జనసేన పార్టీలు ఎన్నికల్లో వచ్చే నెలలోనేనా అన్నట్లుగా యుద్ద ప్రాతిపధికన కార్యకర్తలతో సమావేశాలు, మీటింగ్‌లు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు.
అన్ని పార్టీలు ఇంత హడావుడి చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.
గత ఎన్నికల్లో గౌరవ ప్రధమైన స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈఎన్నికల్లో ఆ స్థానాలను కూడా దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు.ఆ పార్టీలో వర్గ పోరాటాలు మరియు ఆధిపత్య పోరాటాలు పీక్స్‌కు చేరాయి.తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది.
దాన్ని ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవడంలో విఫలం అయ్యింది.తెలంగాణలో కాంగ్రెస్ తప్ప మరే ప్రత్యామ్నాయం లేదు.
అయినా కూడా కాంగ్రెస్ వారు అలసత్వంతో పెద్దగా ప్రభావం చూపడం లేదు.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరిని కలుపుకు పోవడంలో విఫలం అవుతున్నాడు.
ఈమద్య కాలంలో పార్టీలో జాయిన్ అయిన రేవంత్ రెడ్డి అనుకున్న స్థాయిలో రాణించలేక పోతున్నాడు.ఆయన దూకుడుగా వ్యవహరించేందుకు ఆ పార్టీ నాయకులు మోకాలు అడ్డుతున్నారు.
రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నాడు.ఆ సమయంలో రేవంత్ టీఆర్‌ఎస్‌పై ఏ స్థాయిలో విరుచుకు పడేవాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రభుత్వంకు పంటికింద రాయి మాదిరిగా ఎప్పుడు ఏదో ఒక అంశంపై విమర్శలు చేస్తూనే ఉండేవాడు.కాని ఇప్పుడు ఆయన నోరు నొక్కేస్తున్నారు.
ఆయనకు పార్టీలో పెద్దరికంను కట్టబెట్టేందుకు కొందరు నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తాను అంటూ అధిష్టానం వద్ద అనుమతి కోరాడు.
కాని అధిష్టానం మాత్రం అందుకు నిరాకరించింది.తెలంగాణ నాయకులు అధిష్టానం వద్ద యంత్రాంగం నడిపించి అనుమతి రాకుండా చేసినట్లుగా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ముందుకు పోకుండా ఆ పార్టీ నాయకులే కొందరు అడ్డుకుంటున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఇదే సమయంలో వచ్చే ఎన్నికల నాటికి మరింత తగ్గిపోయే అవకాశం ఉందని, కాంగ్రెస్ ముందుకు దూసుకు పోవాల్సింది పోయి, రివర్స్ జర్నీ సాగుతుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
.