అవకాశం ఉన్నప్పుడే అల్లుకుపోవాలి… అవకాశాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి వాటిని సరిగా వినియోగించుకుంటేనే ముందుకు వెళ్లగలం అని బలంగా ఫిక్స్ అయ్యాడో ఏమో తెలియదు గానీ, విశాఖ లో ఓ వైసిపి నేత మాత్రం వినూత్నంగా జనాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గడపగడపకు ప్రభుత్వం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు, అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కుటుంబానికి ఎంతో మేలు జరిగింది అనే విషయాన్ని లెక్కలతో సహా వివరిస్తున్నారు.
అదే విధంగా విశాఖలోని గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ కూడా పాల్గొంటున్నారు.
అయితే 2024 ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సుధాకర్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈయనకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆశీస్సులు కూడా ఉండడంతో, సైలెంట్ గానే ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని తన ప్రచారానికి ఈయన వినియోగించుకుంటున్నారు.

దీనిలో భాగంగానే గడపగడపకు వెళ్తున్న ఆయన ఇంటింటికి గడియారాలను బహూకరిస్తున్నారట.ఈయన యాక్టివ్ గా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న తీరుపై టీడీపీ నుంచి గెలిచి వైసీపీ కి అనుబంధంగా కొనసాగుతున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే గణేష్ కుమార్ కు ఆగ్రహం కలిగిస్తోంది.సుధాకర్ విజయసాయి రెడ్డి అండదండలతోనే ప్రచారం ఉదృతం చేశారని అనుమానిస్తున్నారు.
ఇప్పటికే ఆయన విజయసాయిరెడ్డి పైనా సెటైర్లు వేశారు .వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎమ్యెల్యేల కారణంగానే తప్ప రాజ్యసభ సభ్యుల కారణంగా కాదు అంటూ వ్యాఖ్యానించారు.ప్రస్తుతం సుధాకర్ గడపగడపకు గడియారాలు పంచుతున్న వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.







