రాజధాని తరలింపు వ్యవహారంపై ఏపీ లో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.ఈ అంశం తెరమీదకు వచ్చిన దగ్గర నుంచి అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని తరలింపు వ్యవహారంపై ఇప్పటికే రెండు కమిటీలు నివేదికలు ఇచ్చినా జగన్ మాత్రం మరింత పారదర్శకత కోసం హైపవర్ కమిటీని నియమించారు.ఆ కమిటీ నివేదిక ఇచ్చేందుకు ఇంకా సమయం ఉంది.
అయినా ప్రస్తుతం చెలరేగుతున్న ఆందోళన ప్రభుత్వంలో కంగారు పుట్టిస్తున్నాయి.ఈ వ్యవహారంలో ఏం చేయాలనే విషయంపై అధికార పార్టీ తీవ్రంగా ఆలోచనలో పడింది.
అమరావతి ప్రాంత రైతులు ఆందోళన మరింత ఉధృతం అవుతున్న కారణంగా వారిని శాంతింప చేసేందుకు ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని సమస్యలు రాకముందే రాజధానిని మార్చడమే సరైన పరిష్కారం గా జగన్ ప్రభుత్వం భావిస్తోంది.ప్రస్తుతం హై పవర్ కమిటీ ఈ విషయాలన్నీ పరిశీలిస్తున్నా అంతిమంగా ఆ కమిటీ రిపోర్ట్ జగన్ మనోభావాలకు అనుగుణంగానే ఉంటుందనేది అందరికీ తెలిసిన వాస్తవమే.ఇదంతా రాజధాని వ్యవహారంపై కాలయాపన చేసేందుకు జగన్ మూడు కమిటీలను నియమించారనే విమర్శలు కూడా ఉన్నాయి.
ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేలోపు అమరావతి ప్రాంతంలో ఆందోళనలు మరింత పెరుగుతాయి.తెలుగుదేశం పార్టీ తనకు వచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని విస్తరిస్తోంది.
ఇప్పటికే బెంజ్ సర్కిల్ వద్ద హడావుడి చేసిన బాబు ఆ తర్వాత మచిలీపట్నం సమావేశం లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అలాగే ఆందోళన కార్యక్రమాలు చేయించారు.

తిరుపతి తదితర కీలక ప్రాంతాల్లో మరింత ఆందోళన చేయించేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది.రాజధాని తరలింపు వ్యవహారం లో అనవసరంగా తెలుగుదేశానికి క్రెడిట్ ఇచ్చామనే బాధ అధికార వైసీపీలో ఉంది.అందుకే వీలైనంత తొందరగా జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించి అమరావతి ప్రాంత ప్రజలు, రైతులకు నచ్చచెప్పడం, లేదా రాజధాని తరలింపు ప్రక్రియను వేగవంతం చేయడం ఈ రెండే ఆప్షన్లు అధికార పార్టీ ముందు కనిపిస్తున్నాయి.ఏమి చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా కాలయాపన చేయకుండా తొందరగా తీసుకోకపోతే టీడీపీ ఈ విషయంలో బాగా బలం పుంజుకుంటుంది అనే భయం వైసీపీలో ఎక్కువ కనిపిస్తోంది.