వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మరోసారి విపక్షాలను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారు.వినుకొండలో జరిగిన జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు.
ఈరోజు రాష్ట్రంలో జరిగేది క్లాస్ వార్ అని, పేదవాళ్లు అంతా ఒకవైపు ఉంటే , పెత్తందారులు మరోవైపు ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు.తాను ఒక్కడినే సింహంలా వస్తానని , తమకు ఎవరితోనూ పొత్తులు లేవని జగన్ చెప్పారు.
తోడేళ్లందరూ ఒక్కటై వస్తున్నారని, నాకు ముసలాయన మాదిరి మీడియాతోడు ఉండకపోవచ్చు అని , దత్తపుత్రుడు అండ లేకపోవచ్చు గాని, తాను మాత్రం ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను నమ్ముకున్నానని జగన్ అన్నారు.
తాను పేదలకు సాయం చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని జగన్ విమర్శలు చేశారు.ఈ మూడేళ్లలో 927 కోట్ల రూపాయలు జగనన్న చేదోడు పథకం కింద నిధులను విడుదల చేసామని అన్నారు.దర్జీలు, నాయి బ్రాహ్మణులు, రజకులకు ఈ సాయం అందిస్తున్నామని , వివిధ పథకాల ద్వారా లక్షల కోట్ల నిధులను ఇస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వాలు బలహీన వర్గాలను పట్టించుకోలేదని, దేశంలోనే సంక్షేమ పథకాలు అమలులో ఏపీ ప్రభుత్వం అగ్రస్థానంలో ఉందని జగన్ అన్నారు.రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం చేయూత అందిస్తోందని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని జగన్ అన్నారు. చేదోడు పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేశారు.దీనిలో భాగంగా ఏపీవ్యాప్తంగా 3.30 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా 330 కోట్లను ఈ పథకం కింద విడుదల చేశారు .ప్రతి లబ్ధిదారునికి పదివేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని జగన్ తెలిపారు.తాము ఇన్ని చేస్తుంటే ప్రభుత్వం అంటే గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.