అవును ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన దగ్గుబాటి పురందేశ్వరి విశాఖలో అడుగు పెట్టలేరా ? ఇక, ఆమె ఇప్పట్లో విశాఖ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేరా ? అంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.దీనికి ప్రధాన కారణం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడమే.
వాస్తవానికి ఈ వాదన వెలుగు చూడడంతో ఆమె ఫస్ట్ స్పందించారు.విశాఖలోని తన నివాసంలోనే మీడియా మీటింగ్ పెట్టి మరీ దీనిని ఖండించారు.
ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేది లేదన్నారు.దీనిపై కేంద్రంతోనూ మాట్లాడతామని చెప్పారు.
ప్రతి ఒక్కరినీ తీసుకువెళ్లి కేంద్రంలోని పెద్దలతో చర్చించి తెలుగు వారి మనోభావాలను వెల్లడించి ఉక్కుపై యుద్ధం చేసైనా ఆపుచేస్తామన్నారు.
అయితే ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్లడం అక్కడ ఎవరూ ఆయనను పట్టించుకోకపోవడం వంటివి పురందేశ్వరికి షాక్ ఇచ్చాయి.
ఈ నేపథ్యంలోనే ఆమె సైలెంట్ అయ్యారనే వాదన వినిపిస్తోంది.ఇక, విశాఖపట్నమే ఆమెను జాతీయ రాజకీయ నాయకురాలిని చేసింది.2009లో బాపట్ల నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయినప్పుడు పురందేశ్వరి విశాఖకు మారి అక్కడ నుంచి విజయం సాధించారు.ఆ తర్వాత ఆమె కేంద్ర మంత్రి అయ్యారు.
బీజేపీలో చేరిన ఆమె 2014లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడినా గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసినా ఓడిపోయారు.

అయితే వచ్చే ఎన్నికల్లో అయినా ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం దక్కించుకోవాలని చూస్తున్నారు కానీ, ఇప్పుడు న్న పరిస్తితిలో మాత్రం ఆమె అసలు విశాఖలో అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు.ఒకవైపు కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేయడంతో పాటు ప్రైవేటీ కరణకు మొగ్గు చూపుతుండడంతో పురందేశ్వరి మాత్రమే కాదు ఎంతో మంది ఏపీ బీజేపీ నేతల రాజకీయ భవిష్యత్తు గోతిలో పడినట్లయ్యింది.మరోవైపు పురందేశ్వరి తండ్రి ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం ఎప్పుడూ ఎలుగెత్తి చాటడంతో పాటు ఢిల్లీ వాళ్లు తెలుగోళ్లకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలపై ఎప్పుడూ పోరాటం చేసేవారు.
కాని పురందేశ్వరి మాత్రం విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే తెలుగు వారి ఆత్మగౌరవ నినాదం బీజేపీ కూల్చేస్తుంటే ఆ పార్టీలోనే ఉంటూ పోరాటం కాదు కదా ? కనీసం చిన్న మాట కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారని ఎన్టీఆర్ అభిమానులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.