వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది.
ఇటీవల పొన్నూరు వైసీపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది.ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్గం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వర్గం మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి.
ఇటీవల పెదకాకాని మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణాపై దాడి వ్యవహారం ఇరు వర్గాల మధ్య విభేదాలను మరింత పెంచింది.ఈ క్రమంలో రావి వర్గం ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది.
ఈ నేపథ్యంలో రావి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులు వచ్చాయి.దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
అయితే, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే వారిని ఉపేక్షించబోనని గతంలోనే పార్టీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు.