ఏపీ సీఎం జగన్‌ను తాజాగా విడుదల అయిన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ తెగ టెన్షన్ పెట్టేస్తోందట.మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది.
నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 4.మార్చి 15న పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.టీడీపీ నుంచి నాలుగు సీట్లు ఖాళీ కానున్నాయి.మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి రాజ్యసభకు వెళ్లిన మాజీ మంత్రి పిల్లి బోస్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ సీటు కాగా… మరొకటి ఇటీవల మృతి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి స్థానంలో భర్తీ చేసేది.
అసెంబ్లీలో వైసీపీకి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.నాలుగు సీట్లు ఆ పార్టీ ఖాతాలో పడే విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు లేవు.
అయితే జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చిన వారితో పాటు ఎలాంటి పదవులు లేకుండా ఎమ్మెల్సీ కోసం ఆశిస్తోన్న వారి సంఖ్య ఏకంగా 50 కు పైగా ఉంది.ఇక్కడ ఖాళీలు మాత్రం ఆరే ఉన్నాయి.
వీటిలో రెండు స్థానాలను మాత్రం ఇప్పటికే రిజర్వ్ చేశారు.ఒకటి తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి గెలిచి.
హఠాన్మరణం చెందిన బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి.మరొకటి ఇటీవల మృతి చెందిన చల్లా కుటుంబానికి ఇస్తారట.
అదే జరిగితే అప్పుడు మరో నాలుగు సీట్లు మాత్రమే ఖాళీగా ఉంటాయి.కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ఆశావాహుల లిస్ట్ చాంతాడంత ఉంది.
వీరిలో ఎవరికి పదవులు ఇచ్చినా మిగిలిన నేతలు ఆగ్రహంతో ఉండడం ఖాయం.

ఒక్క గుంటూరు జిల్లా నుంచే ఇద్దరు సీనియర్ నేతలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు.పైగా మర్రికి మంత్రి పదవి హామీ ఉండడంతో ఆయనకు తప్పకుండా ఎమ్మెల్సీ ఇవ్వాలి.ఇక చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు కరణం బలరాంకు మధ్య జరుగుతోన్న వార్‌లో ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి పరుచూరు బాధ్యతలు ఇస్తామన్నారట.
దీంతో ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా రిటైర్ అవుతున్న మహమ్మద్ ఇక్బాల్ తనను మళ్లీ మండలికి పంపాలని కోరుతున్నారు.
పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషేన్ రాజు, తూర్పు నుంచి తోట త్రిమూర్తులు, ప్రకాశం నుంచి గొట్టిపాటి భరత్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు ఉన్నారు.మరి వీరిలో జగన్ స్వీటు ఎవరికో ? హాటు ఎవరికో ? చూడాలి.