హుజురాబాద్ బై పోల్‌కు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదు.కానీ, నియోజకవర్గంలో రాజకీయ పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.
అధికార టీఆర్ఎస్ పార్టీ ‘దళిత బంధు’ గురించి ప్రచారం, గొర్రెల పంపిణీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నది.అయితే, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? అనేది ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు.కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్వయంగా సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హుజురాబాద్ నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తున్నారు.ఇకపోతే మోకాలికి సర్జరీ అనంతరం మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మళ్లీ పాదయాత్ర షురూ చేశారు.
బీజేపీ తరఫున పోటీలో నిలబడ్డ ఈటల, గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాగా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితియే అయోమయంగా ఉన్నట్లు తెలుస్తోంది.గత ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున బరిలో ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి గులాబీ గూటికి చేరుకుని ఎమ్మెల్సీ దక్కించుకున్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో జోష్ తగ్గిందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
ఇకపోతే టీపీసీసీ చీఫ్ రేవంత్ హైదరాబాద్‌లోని హుజురాబాద్ ఉప ఎన్నిక విషయమై ఇప్పటికే రెండు సార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ అభ్యర్థి ఎవరు? అనేది తేల్చలేకపోయారు.కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన మహిళా నేత కొండా సురేఖ పేరు వినబడినప్పటికీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.

తాజాగా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అసలు బరిలో నిలిచేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.అయితే, ఇవి ఊహాగానాలేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.ఇకపోతే కాంగ్రస్ పార్టీ తరఫున హుజురాబాద్ బై పోల్ బరిలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ చీఫ్ కవ్వంపల్లి సత్యనారాయణ, వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత దొమ్మాటి సాంబయ్య పేర్లు కూడా వినిపిస్తున్నాయి.చూడాలి మరి.ఇంతకీ రేవంత్ మదిలో ఎవరు ఉన్నారో.అయితే, కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కడం కూడా కష్టమేననే విమర్శలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్ల ఓట్ల చీలికి జరిగి, అధికార పార్టీకే లాభం జరుగుతుందని కొందరు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.