ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని జనసేన పార్టీ ఉవ్విళ్లూరుతోంది.అయితే ఆ పార్టీ ఎంత వరకు బలంగా ఉంది అనే విషయం గురించి ఆరా తీస్తే ఆ పార్టీ నేతలకు వాస్తవాలు బోధపడతాయి.13 ఉమ్మడి జిల్లాలలో ఏ జిల్లా కూడా మాది అనుకునే స్థితిలో జనసేన పార్టీ లేదనే విషయం మాత్రం వాస్తవమని జనసేన పార్టీ నేతలు ఒప్పుకుని తీరాల్సిందే.అయితే అధికారంలోకి రావాలంటే ముందు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం ముఖ్యం.
జనసేన పార్టీని ప్రజలు ఎంత వరకు నమ్ముతున్నారనే విషయంపై అధ్యయనం చేస్తే పవన్ చెప్పే మాటలు ప్రజలపై పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ చూపించడం లేదని రాజకీయ పండితులు భావిస్తున్నారు.అయితే లాజిక్ ప్రకారం చూస్తే చంద్రబాబుకు ఒకసారి, జగన్‌కు ఒకసారి అధికారం కట్టబెట్టిన ప్రజలు పవన్‌కు ఎందుకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వరనే చర్చ జనసేన నేతల్లో నడుస్తోంది.
వాస్తవానికి 2014 ఎన్నికల్లో అనుభవానికి ప్రజలు పెద్ద పీట వేశారు.కానీ చంద్రబాబు హయాంలో నిధులు లేవు, రాజధాని లేదు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టు ఉన్నా నిధుల కొరతతో పూర్తి కాని పరిస్థితి.దీంతో 2019లో జగన్‌కు అవకాశం ఇచ్చి చూశారు.
జగన్ ఎన్నో తాయిలాలను ఇస్తానని.తన పాలనలో స్వర్గం చూపిస్తానని ప్రామిస్ చేసి మరీ గద్దెనెక్కారు.

చంద్రబాబు హయాంలో లేని రాజధాని జగన్ హయాంలో వచ్చిందా అంటే అదీ లేదు.మూడు రాజధానులు అంటూ ఏ రాజధానిని కూడా ప్రజలకు కాకుండా చేశారు.జగన్ హయాంలోనూ పోలవరం పూర్తి కాలేదు.ప్రత్యేక హోదా కూడా రాలేదు.రైల్వే జోన్ కూడా సాధ్యపడలేదు.డబ్బులు పంచుతున్నాం అనే ఒక్క మాట తప్ప జగన్ హయాంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు.
దీంతో తమకు అవకాశం ఇవ్వాలంటున్న పవన్ కళ్యాణ్‌ను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా అన్నది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.







