కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లక్షల్లో కేసులు వస్తున్నాయి.గాలి ద్వారా కూడా ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో కరోనా రాకుండా ఉండాలంటే కేవలం ఒక్క మాస్క్ పెట్టుకుంటే సరిపోదా.? రెండు మాస్కులు కచ్చితంగా వాడాల్సిందేనా ? అంటే చాలామంది నోట అవుననే సమాధానమే వినిపిస్తోంది.కరోనా నుంచి రక్షణ పొందాలంటే N95 మాస్కులు ధరించాలని, ఒకవేళ బట్ట మాస్కులు వాడుతుంటే రెండు వాడాలని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఇప్పటికే సూచించగా దీన్ని బలపరుస్తూ తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది.కొవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో ఎలాంటి మాస్కులు వాడితే వైరస్ ను అడ్డుకోవచ్చన్న అంశం పై యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ ఇటీవల ఒక అధ్యయనం జరిపింది.
రెండు మాస్కులను వాడటం వల్ల కరోనా వైరస్ కణాలు ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించలేవని ఈ అధ్యయనంలో తేలింది.ఈ మేరకు జామా ఇంటర్నేషనల్ మెడిసిన్ లో ఒక కథనం ప్రచురితమైంది.
దీని ప్రకారం మాస్క్‌లలో పొరలు పెరగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.ఎందుకంటే మాస్క్ పొరలు పెరిగినప్పటికీ వాటి మధ్య ఖాళీలు అలాగే ఉంటాయి.
అలాగే మాస్కులు కూడా అందరి ముఖాలకు పట్టుకున్నట్టుగా ఉండవు.గ్యాప్ ఉంటుంది.
వైరస్ కణాలను అడ్డుకునే సామర్థ్యంతో మెడికల్ ప్రోసీజర్ మాస్కులు తయారైనప్పటికీ అవి మన మొఖాలకు సరిగ్గా సరిపోవని యూఎన్‌సీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ ఎమ్లీ సిక్బెర్ట్ బెన్నిట్ తెలిపారు.దీనివల్ల మనం మాట్లాడినప్పుడు, నవ్వినప్పుడు ఇలా మన ముఖ కవళికలు మారినప్పుడల్లా మాస్క్ వదులుగా అవుతుంది.
దీంతో వైరస్ కణాలు సులువుగా మన ముక్కు, నోటిని చేరే అవకాశం ఉంటుంది.

అదే బట్ట మాస్క్ తో పాటు సర్జికల్ మాస్క్‌ను ధరించడం వల్ల రెండు కలిపి మన మొఖానికి పట్టేసినట్టు బిగుతుగా ఉంటాయి.దీనివల్ల వైరస్ కణాలను అడ్డుకునే సామర్థ్యం పెరుగుతుంది.సాధారణంగా వైరస్ కణాలను అడ్డుకోవడంలో సర్జికల్ మాస్కులు 40 నుంచి 60 శాతం సమర్థతను కలిగి ఉంటాయి.
బట్టతో తయారైన మాస్కులు 40 శాతానికి పైగా సమర్థతను కలిగి ఉంటాయి.అదే బట్ట మాస్కులతో పాటు సర్జికల్ మాస్కులను ధరించినప్పుడు బిగుతుగా ఉండటం వల్ల వైరస్ లను అడ్డుకునే సామర్థ్యం 20 శాతం అదనంగా పెరిగినట్టు సిక్బెర్ట్ వెల్లడించారు.
అందుకే కరోనా వైరస్‌ను అడ్డుకోవాలంటే రెండు మాస్కులు ధరించాలని సూచించారు.అదే మాస్క్ మన మొఖానికి సరిగ్గా సరిపోయినట్లు బిగుతుగా ఉంటే ఒక్క మాస్క్ పెట్టుకున్నా సరిపోద్దని తెలిపారు.