దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం అనుకున్న సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెనకడుగు వేశారు.జాతీయ స్థాయిలో ఆయనకు కీలక పదవిని అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమైనా, కొన్ని కొన్ని బలమైన కారణాలతో ప్రశాంత్ కిశోర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు తగిన సూచనలు చేయడంతో పాటు, అధికారంలోకి వచ్చేందుకు ఏం చేయాలనే విషయంపై రకరకాల సలహాలను అందించారు. కానీ పార్టీలో మాత్రం చేరడం లేదంటూ ఆయన ప్రకటించడం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ కలిగించింది.
ప్రశాంత్ కిషోర్ అండదండలు ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమేమీ కాదు అన్న అభిప్రాయం ఆ పార్టీలో ఉన్న సమయంలోనే, ఈ విధంగా హ్యాండ్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది.అయితే దీని వెనుక కారణాలు చాలానే ఉన్నాయట.
రాజకీయ వ్యూహకర్తగా సక్సెస్ అయినా తాను రాజకీయ నాయకుడిగా ఎంత మేరకు సక్సెస్ అవుతాననే విషయాన్ని ఆలస్యంగా ప్రశాంత్ కిషోర్ లెక్కలు వేసుకున్నారట.అదీ కాకుండా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే కాంగ్రెస్ లో తాను ఇమడలేను అనే విషయాన్ని తీరిగ్గా అంచనా వేసుకున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.సొంత పార్టీ నాయకులపైనే ఒకరికి ఒకరు సంచలన విమర్శలు చేసుకుంటూ ఉంటారు.అటువంటి పార్టీలో చేరి 2024 వరకు తట్టుకోవడం అంటే కష్టమైన పని. అదీ కాకుండా పార్టీ పదవిలో ఉంటూ .రాజకీయ వ్యూహాలు అమలు చేయాలన్నా అది సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చారట.

రాజకీయ వ్యూహ కర్తగా ఒక పార్టీకి వ్యూహాలు అందిస్తే, ఆ పార్టీ అధికారంలోకి వస్తే క్రెడిట్ వస్తుందని , రాకపోతే కొద్దిరోజుల తర్వాత ఆ సంగతి అంత మర్చిపోతారు అని, కానీ పార్టీలో చేరితే.ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే తర్వాత తలెత్తే పరిణామాలు తన భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పికే లెక్కలు వేసుకుని మరీ కాంగ్రెస్ లో చేరకుండా వెనకడుగు వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.