ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ సంస్థ స్టార్‌బక్స్( Starbucks ) సంచలన నిర్ణయం తీసుకుంది.సీఈవోగా ఉన్న భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్‌ను( Laxman Narasimhan ) తప్పించి ఆయన స్థానంలో బ్రియాన్ నికోల్‌ను( Brian Niccol ) నియమించింది.
నరసింహన్ సీఈవోగా, స్టార్‌బక్స్ బోర్డ్ సభ్యునిగా పదవీ విరమణ చేయనున్నారని.తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది.
స్టార్‌బక్స్‌కు ప్రత్యర్ధి సంస్థల నుంచి పోటీ ఎక్కువ అవుతుండటం, వ్యాపారంలో ఒడిదుడుకుల నేపథ్యంలో లీడర్‌షిప్ మార్పు చోటు చేసుకుంది.వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడటం, చైనాలో కఠినమైన మార్కెట్ పరిస్ధితులతో ఈ ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది.

ఈ నేపథ్యంలో లక్ష్మణ్ నరసింహన్ నేపథ్యం గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.మే 15, 1967న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన ఆయన పూణే విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు.అనంతరం పెన్సిల్వేనియా వర్సిటీ( University of Pennsylvania ) అనుబంధ లాడర్ ఇన్స్‌స్టిట్యూట్ నుంచి జర్మన్, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేచేశారు.అలాగే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం అనుబంధ వార్టన్ స్కూల్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.

మెకిన్సేలో దాదాపు 19 సంవత్సరాల సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన అమెరికా, భారత్, ఆసియాలలోని కన్జ్యూమర్ గూడ్స్, రిటైల్, హెల్త్ కేర్ తదితర పరిశ్రమలకు సలహాలు అందజేశారు.మెకిన్సేను వీడిన తర్వాత పెప్సికోలో చేరిన లక్ష్మణ్ పలు హోదాలలో పనిచేశారు.ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వ్యూహాలను పర్యవేక్షిస్తూ గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా సేవలందించారు.లాటిన్ అమెరికా, యూరప్, సహారా ఆఫ్రికాలలో కంపెనీ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు.లాటిన్ అమెరికా సీఈవోగా, పెప్సికో అమెరికాస్ ఫుడ్స్( PepsiCo Americas Foods ) సీఎఫ్‌వోగానూ సేవలందించారు.
2019లో నరసింహన్ గ్లోబల్ కన్జ్యూమర్ హెల్త్, హైజీన్, న్యూట్రిషన్ సేవలు అందిస్తున్న రెకిట్‌లో సీఈవోగా నియమితులయ్యారు.తన పదవీకాలంలో కంపెనీ ఈ-కామర్స్ వ్యాపారాన్ని వృద్ధి చేసిన ఆయన.కరోనా సమయంలో శ్రామికశక్తికి మద్ధతుగా కీలక కార్యక్రమాలను ప్రారంభించారు.2022 అక్టోబర్‌లో స్టార్‌బక్స్‌లో చేరిన లక్ష్మణ్ నరసింహన్.మార్చి 2023లో అధికారికంగా సీఈవో బాధ్యతలు చేపట్టారు.







