జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో ముందుకు సాగిపోతున్నారు.అయితే సినిమాల కంటే రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
వారానికి ఒకరోజు ప్రజావాణి పేరుతో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.గతంలో రెండు వారాల పాటు విజయవాడలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ ఆదివారం నాడు భీమవరంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇటీవల ఏపీలో రోడ్ల దుస్థితిని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తెచ్చేందుకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ కొత్త కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ చేపట్టారు.అయితే రాజకీయంగా ప్రజల్లోకి బాగానే వెళ్తున్నా వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసే స్థానంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేయగా వచ్చే ఎన్నికల్లో కూడా భీమవరం నుంచే పోటీ చేస్తారని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే కాకినాడ జిల్లా పిఠాపురం, బాలాజీ జిల్లాలోని తిరుపతి నుంచి పోటీ చేస్తారని కొందరు జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు.ఈసారి పవన్ ఒక్కచోట మాత్రమే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.అది కూడా భీమవరం నుంచే పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
జనసేన పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలే కీలకం కాబట్టి తాను పోటీ ఇక్కడి నుంచి చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ విశ్వసిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.గత ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేసిన పవన్ వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో 8,357 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఏరికోరి ఎంచుకున్న నియోజకవర్గమే అయినా పవన్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు.అలాంటి భీమవరం నియోజకవర్గం నుంచే పవన్ మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే భీమవరంలో ఆయన ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టారన్న వాదన కూడా వినిపిస్తోంది.ఈరోజు భీమవరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గతంలో భీమవరం వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలు కనిపించాయో ఇప్పుడు కూడా అవి పరిష్కారం కాలేదని అసహనం వ్యక్తం చేశారు.